కరోనా లాక్డౌన్ వల్ల తిరుమల కొండపై శ్రీవారి భక్తుల దర్శనాలు నిలిచిపోయాయి. 60 రోజులుగా భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించకపోవడం బాధాకరమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఐతే దర్శనాలు ఎప్పుడు పున: ప్రారంభమవుతాయో ఇప్పట్లో చెప్పలేమని తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులపై వెంకన్న ఆశీస్సులు అందించాలన్న ఉద్దేశంతో లడ్డూ ప్రసాదాలను విక్రయించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. రూ.50 లడ్డూను రూ.25కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మంటపాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతున్నాయని.. ప్రత్యేక ఆర్డర్‌పైనా స్వామి వారి లడ్డూలు పంపిణీ జరుగుతుందని చెప్పారు. మరింత సమాచారం కోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ (9849575952), పేష్కార్ శ్రీనివాస్ (9701092777)ను సంప్రదించాలని ఆయన సూచించారు.
మే 31 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంది. మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేయడంతో.. తిరుమలో ఇప్పట్లో భక్తులను అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వెంటనే దర్శనాలను ప్రారంభించేందుకు టీటీడీ మాత్రం అన్ని ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లలో అధికారులు మార్కింగ్ చేయించారు. ఐతే 31 తర్వాతే టీటీడీ దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
Published by:Shiva Kumar Addula
First published:May 20, 2020, 15:24 IST