తిరుమల (Tirumala) లో హోటళ్లపై టీటీడీ (TTD) తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో తిరుమలపై ఆహారం విక్రయాలను నిషేధించాలని తీర్మానించారు.
తిరుమల (Tirumala) లో హోటళ్లపై టీటీడీ (TTD) తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో తిరుమలపై ఆహారం విక్రయాలను నిషేధించాలని తీర్మానించారు. దీంతో కొండపై హోటళ్లు మూతపడక తప్పని పరిస్థితి నెలకొంది. తిరుమలలో రాబోయే రోజుల్లో హోటళ్ళు, ఫాస్టు ఫుడ్ సెంటర్లు లేకుండా చేసి అన్ని ముఖ్య కూడళ్ళలో ఉచితంగా అన్నప్రసాదాలు అందించాలని నిర్ణయానికి టీటీడీ ఆమోదముద్ర వేసింది. అత్యున్నత స్థాయి నుండి సామాన్య భక్తుడి వరకు ఒకే రకమైన ఆహారం అందించాలని తీర్మానం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది పడే వ్యాపారులకు ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి లైసెన్స్లు మంజూరు చేయాలని టీటీడీ భావిస్తోంది.
టీటీడీ నిర్ణయం తీసుకున్న తర్వాతి రోజే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలోని రావి చెట్టు సెంటర్లో ఉన్న పాత అన్నదానం కాంప్లెక్స్, చుట్టుపక్కల ఉన్న హోటళ్ళను పరిశీలించారు. పాత అన్నదానం కాంప్లెక్స్ లోని లగేజీ కౌంటర్ నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఈ భవనంలో అన్న ప్రసాదం ఎలా వడ్డించే వారని, భక్తులను ఏ మార్గంలో లోనికి అనుమతించి ఏ మార్గంలో బయటకు పంపేవారనే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రావి మాను సర్కిల్లోని హోటళ్ళను పరిశీలించారు. అక్కడ ఉన్న భక్తులతో వసతి, సర్వదర్శనం ఎలా జరిగిందనే వివరాలు తెలుసుకున్నారు.తిరుమలలో ఎక్కడా ఆహారం విక్రయించకుండా, టీటీడీనే భక్తులందరికీ ఉచితంగా అన్నప్రసాదాలు అందిస్తుందని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం బోర్డ్ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ఈ ఏర్పాట్ల కోసమే పాత అన్నదానం కాంప్లెక్స్ ను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. అధికారులతో చర్చించి ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దర్శనం చేసుకున్న భక్తులకు టీటీడీ మూడు పూటలా అన్నప్రసాదం అందిస్తోంది. ఐతే అన్నప్రసాదం దొరకనివారు. ఉదయమే కొండపైకి చేరినవారు హోటళ్లపైనే ఆధారాపడాల్సి వస్తోంది. దీంతో కొండపై వందలాది హోటళ్లు వెలిశాయి. వీటిపైనే వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఐతే టీటీడీ తాజా నిర్ణయం హోటళ్ల యజమానులను షాక్ కు గురిచేసింది. టీటీడీ నిర్ణయాన్ని అమలు చేస్తే వాటిని మూసేయాల్సివస్తుంది. దీనిపై హోటల్ యజమానులు, అక్కడ పనిచేసేవారు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రత్యామ్నాయ వ్యాపారలకు అవకాశమిస్తామని టీటీడీ చెబుతున్నా.. హోటళ్ల యజమానులు ఎలా స్పందిస్తారనేది కూడా చర్చనీయాంశమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.