TTD News: సెప్టెంబరు 19 నుంచి 28 వరకు నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాంమని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. కరోనా వైరస్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలుకీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా ఈ ఏడాది స్వామివారి వాహన సేవలు మాడవీధుల్లో నిర్వహించే పరిస్థితి లేదని, బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయని వివరించారు. అక్టోబర్‌లో ఉత్సవాల సమయానికి కరోనా ప్రభావం తగ్గితే యథాతథంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. బర్డ్ ఆసుపత్రిలో నూతన గదుల నిర్మాణానికి రూ.5.5కోట్లు, విశాఖలోని ఆలయానికి రహదారి కోసం రూ.4.5 కోట్లు నిధుల కేటాయించామని సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. కరోనా బారిన పడిన టీటీడీ ఉద్యోగుల వైద్య ఖర్చులు బోర్డు భరించాలని పాలకమండలి నిర్ణయించిందన్నారు. తిరుమలలో వ్యర్థ పదార్థాల నిర్వహణకు ఆధునిక పద్ధతుల కోసం టీటీడీ బోర్డు సభ్యురాలు సుధానారాయణమూర్తి రూ.కోటి విరాళం ఇచ్చారని వెల్లడించారు.
గో-సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ నిర్ణయించిందని, ప్రతి ఆలయానికి ఒక గోవును ఇవ్వాలని సమావేశంలో చర్చించినట్లు ఛైర్మన్ చెప్పారు. గోవు ఇచ్చే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. బ్యాంకుల్లో స్వామి వారి విరాళాల డిపాజిట్ విధానాలు మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. రేపటి నుంచి తిరుపతిలో 3 వేల చొప్పున ఉచిత దర్శన టోకన్లు జారీ చేస్తున్నట్లు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
‘శ్రీవారి కీర్తిని నలుదిక్కుల వ్యాప్తి చేసే విధంగా దేవాలయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం. బాంబేలో దేవాలయం నిర్మాణం కు శ్రీకారం చుట్టుతాం. వారణాశిలో దేవాలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వాన్ని స్థలం కేటాయింపు అనుమతులు కోరాం. జమ్మూ కాశ్మీర్ లో కూడా ఆలయం నిర్మాణం చేపడుతాం. కరోనా ప్రభావం కారణంగా కొద్ది ఆలస్యం అవుతోంది. స్థానికంగానే విరాళాలు సేకరించి అక్కడ ఆలయాలు నిర్మాణం చేపట్టాలని పాలకమండలి నిర్ణయం తీసుకున్నాం. ప్రధానంగా టీటీడీలో ఆదాయం పెంచేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్లు పై కార్పస్ ఫండ్స్ లో కొన్ని మార్పులు తీసుకురానున్నాం. బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలోనే చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణం చేపట్టబోతున్నాం. వైజాగ్ లో శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తి చేశాం. కరోనా ప్రభావం తగ్గిన తరువాత మహా కుంభాభిషేకం నిర్వహిస్తాం.’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd