TRAGIC ACCIDENT HAPPENED IN WEST GODAVARI DISTRICT APSRTC BUS FELL DOWN IN CANAL 9 KILLED SO FAR FULL DETIALS HERE PRN
Breaking News: ప.గో జిల్లాలో ఘోర ప్రమాదం.. వాగులో పడిన ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి
పశ్చిమగోదావరి జిల్లాలో వాగులో పడిన బస్సు
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జంగారెడ్డి గూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పు జల్లేరు వాగులో పడటంతో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) లో ఘోర ప్రమాదం జరిగింది. జంగారెడ్డి గూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పు జల్లేరు వాగులో పడటంతో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. బస్సు వాగులో పడిన సమయంలో 47 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాగులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని జంగారెడ్డి గూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు తెలంగాణలోని భద్రాచలం నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు జల్లేరు వాగు వంతెన పైకి రాగానే ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు వంతెనను ఢీ కొట్టి వాగులో పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సంతా నిండుగా ఉంది. ఖమ్మం జిల్లా తాడ్వాయి దాటిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశించిన తర్వాత ప్రమాదం జరిగింది. బస్సు ఎడమవైపుకు పడిపోవడంతో ప్రయాణికులంతా ఒకేవైపుకు పడిపోవడంతో మృతుల సంఖ్య పెరిగింది. బస్సు అద్దాలు తీసిఉండటంతో చాలా మంది నీటిలో కూరుకుపోయి మృతి చెందారు. ఇప్పటివరకు 9మంది మృతదేహాలను అధికారులు బయటకు తీశారు. ప్రమాదం జరిగినదాన్ని బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటివరకూ బయటకు తీసిన మృతదేహాల్లో ఐదుగురు మహిళలున్నారు. ప్రమాదంలో డ్రైవర్ చిన్నారావు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. ప్రమాదానికి అతివేగం కారణం కాదని.. ఆ సమయంలో బస్సు నెమ్మదిగానే వెళ్తున్నట్లు కండక్టర్ చెబుతున్నారు.
ఒక్కసారిగా బస్సు వాగులో పడిపోవడంతో అసలేం జరిగిందనేది ప్రయాణికులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. స్థానిక అధికారులు, పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈత వచ్చిన వారు నేరుగా వెళ్లి ప్రయాణికులను కాపాడగా.. కొందరిని పడవల్లో రక్షించారు. ఇప్పటివరకు దాదాపు 30 మందిని 108 ద్వారా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సీఎం జగన్ కూడా సహాయక చర్యలపై ఆరా తీశారని.. పరిస్థితి విషమంగా ఉన్నవారిని విజయవాడ లేదా హైదరాబాద్ తరలిస్తామన్నారు. బస్సుకు ఎదురుగా లారీ రావడం వల్ల ప్రమాదం జరిగినట్లు తమకు ప్రాధమిక సమాచారం అందిందని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్, ఆర్డీవోతో పాటు ఎమ్మెల్యే ఘటనాస్థలిలో ఉన్నట్లు పేర్ని నాని వెల్లడించారు. మరోవైపు ప్రస్తుతం మృతుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో అధికారులు తెలిపారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.