హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఏపీలో విషాదం.. నలుగురిని మింగేసిన బావి.. ఒకరి కోసం మరొకరు వెళ్లి అందరూ మృతి

Andhra Pradesh: ఏపీలో విషాదం.. నలుగురిని మింగేసిన బావి.. ఒకరి కోసం మరొకరు వెళ్లి అందరూ మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటి యజమాని కుమారుడు రంగాకు.. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరు తండ్రి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. తండ్రి కోసం కూతుళ్లు ఏడవడం చూసి.. గ్రామస్తుల కూడా కంటతడిపెట్టారు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బావిలో పూడిక తీసేందుకు వెళ్లి.. నలుగురు వ్యక్తులు మరణించారు. ఒకరి కోసం మరొకరు బావిలోకి దిగి..ఊపిరాడక కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. బంటుమిల్లి గ్రామానికి చెందిన కొండా నాగేశ్వరరావు కర్రల వ్యాపారం చేస్తుంటాడు. వీరి ఇంట్లో ఓ ఊట బావి ఉంది. చాలా రోజులుగా పూడిక తీయకపోవడంతో.. బావిలో మట్టిపేరుకుపోయింది. ఈ క్రమంలోనే ఊట బావిలో పూడిక తీసేందుకు.. గ్రామంలోని బీఆర్ఎర్ కాలనీకి చెందిన వంజల రామారావు (60 ఏళ్లు) అనే వ్యక్తిని కూలీకి పిలిచారు. రామారావు తనకు సాయంగా తన కుమారుడు వంజల లక్ష్మణ్‌ (35)తో పాటు శ్రీనివాసరావు (53)అనే మరో వ్యక్తిని తీసుకెళ్లాడు. రామారావు, లక్ష్మణ్, శ్రీనివాసరావు శుక్రవారం మధ్యాహ్నం పూడికి తీసేందుకు బావిలోకి దిగారు.

ముందుగా శ్రీనివాస రావు బావిలోకి దిగాడు. నాలుగు బకెట్ల మట్టిని తోడిన తర్వాత.. ఊపిరాడలేదు. శ్వాస అందక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గట్టిగా కేకలు వేయడంతో.. రామారావు, లక్ష్మణ్ అప్రమత్తమయ్యారు. బావిలోకి తాడును వేసి.. దాని సాయంతో పైకి రావాలని శ్రీనివాసరావుకు చెప్పారు. దానితో సాయంతో పైకి లాగే ప్రయత్నం చేశారు. కానీ శ్రీనివాసరావుకు ఆక్సిజన్ అందకపోవడంతో... తాడును సరిగ్గా పట్టకోలేకపోయాడు. తాడును వదలిపెట్టి.. బావిలోనే పడిపోయాడు. ఆ తర్వాత లక్ష్మణ్ బావిలోకి దిగి శ్రీనివాసరావును కాపాడాలనుకున్నాడు. కానీ ఊపిరాడక అతడు కూడా ఇబ్బందిపడ్డాడు. వారిద్దరు ప్రమాదంలో ఉన్నారనితెలిసి.. రామారావు కూడా బావిలోకి దిగాడు. ఆ తర్వాత ఇంటి యజమాని కుమారుడు కొండా రంగా కూడా బావిలోకి వెళ్లాడు. ఇలా ఒకరి కోసం మరొకరు బావిలోకి దిగి.. మొత్తం నలుగురూ ఊపిరాడక మరణించారు. వారి మృతదేహలను స్థానికులు అతి కష్టం మీద వెలికితీశారు.

ఈ ఘటనతో బంటుమిల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొండా నాగేశ్వరరావు కుటుంబంతో పాటు వంజల రామారావు కుటుంబాంలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఉన్న వారు.. అంతలోనే శవాలుగా మారడంతో.. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటి యజమాని కుమారుడు రంగాకు.. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరు తండ్రి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. తండ్రి కోసం కూతుళ్లు ఏడవడం చూసి.. గ్రామస్తుల కూడా కంటతడిపెట్టారు. ఈ ఘటనపై ఏపీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంటుమిల్లికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news

ఉత్తమ కథలు