ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అరకు ఘాట్ రోడ్డులోని అనంతగిరి మండలం డుముకు గ్రామం వద్ద మలుపులో బస్సు అదుపుతప్పి లోయలో బోల్తాపడింది. ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 25 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. విశాఖ-అరకు ఘాట్ రోడ్డులోని 5వ నంబర్ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని అనంతగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లోయలోపడ్డ బస్సును బయటకు తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు. దినేష్ ట్రావెల్స్ బస్సులో అరకు టూర్ కు రాగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో పరిస్థితిని బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమంది.
ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిలో కొంతమందిని విజయనగరం జిల్లా ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు దాదాపు 350 అడుగుల లోతులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన మలుపు హెయిర్ పిన్ మాదిరి ఒంపుగా ఉండటంతో ఎదుట ఏముందనేది డ్రైవర్ గుర్తించనట్లు తెలుస్తోంది. ఘాట్ రోడ్డుపై అవగాహన లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు.
మరోవైపు బస్సులో ఇంకా మృతదేహాలున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. హైదరాబాద్ షేక్ పేట్ నుంచి విశాఖ మన్యం పర్యటనకు వచ్చినట్లు గుర్తించారు. బస్సు డ్రైవర్ ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సహాయక చర్యల్లో పోలీసులతో పాటు గిరిజనులు పాల్గొంటున్నారు. ప్రమాదం కారణంగా విశాఖ-అరకు ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Araku, Visakhapatnam, Vizag