CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ హస్తిన బాట పట్టారు. ఒకే నెలలో రెండోసారి ప్రధానిని కలవడానికి కారణం అదేనా..? ప్రధాని ముందు సీఎం జగన్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు. అందుకే ప్రధాని మరోసారి అపాయింట్ మెంట్ ఇస్తున్నారా..?
CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు పొత్తులు చుట్టూ తిరుగుతున్నాయి. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అన్నది ఊహాగానేలా కాని.. అధికారికంగా జనసేన (Jansena)-బీజేపీ (BJP) మినహా మరే పొత్తులు ఫిక్స్ అవ్వలేదు. ముఖ్యంగా వైసీపీ (YCP)తో కాంగ్రెస్ (Congress) పొత్తు అంటూ ప్రచారం మొదలైంది. దీనిపై వైసీపీ నేతల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ సింగిల్ గానే బరిలో దిగుతుందని కొందరు అంటే.. పొత్తుల విషయంలో అధినేతదే ఫైనల్ అని మరికొందరు.. తమ డిమాండ్లకు మద్దతు తెలిపిన పార్టీకే మద్దతు అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సీఎం జగన్ (CM Jagan) మాత్రం ఇప్పటి వరకు ఈ పొత్తుల విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి సమయంలో ఆయన మరోసారి హస్తిన పర్యటనకు సిద్దం కావడం రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. రెండు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ (Prime Minster Modi)తో సమావేశం కానున్నారు. అయితే ఈ నెల తొలి వారంలో కూడా సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.. అప్పుడు ప్రధాని మోదీతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కేవలం నెల రోజుల సమయంలోనే ప్రధాని మోదీతో మరోసారి సమావేశం కానుండటంతో ఈ పర్యటన ఆసక్తి కరంగా మారింది.
ఈ సారి సీఎం -పీఎం భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో అర్దిక పరిస్థితులు..కేంద్రం నుంచి తోడ్పాటు అంశం పైన చర్చిస్తారని వైసీపీ వర్గాల సమాచారం. దీంతో పాటుగా పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించనున్నారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని కేంద్రం చెబుతున్నా... సవరించిన అంచనాలకు ఇప్పటి వరకు అధికారికంగా ఆమోదం ఇవ్వలేదు. అదే విధంగా తాజాగా నిర్మాణాలకు సంబంధించి మరో రూ 800 కోట్ల మేర అదనపు భారం పడనుందని తాజాగా అంచనాకు వచ్చారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సీఎం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇప్పటికే మూడేళ్లు పూర్తి కావటం... ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవటంతో..దీని పైన ప్రధానితో సీఎం జగన్ ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరైనా వైసీపీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని జగన్ హామీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే తాజాగా పెట్రో ఉత్పత్తుల పైన వ్యాట్ తగ్గింపు అంశం పైనా నేరుగా ప్రధానితో చర్చించే అవకాశం ఉందని టాక్. వీటన్నటితో పాటు.. ఏపీలో రాజకీయ అంశాల పైన చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్, వైసీపీ పొత్తు ప్రచారంపైనా ప్రధాని ఆరా తీసే అవకాశం ఉంది అంటున్నారు.
ఇక, ఈ నెల 30వ తేదీన జ్యుడిషీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాల పైన ఇప్పటికే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - సీఎం జగన్ సమావేశమయ్యారు. జాతీయ సదస్సులో ప్రస్తావించాల్సిన అంశాల పైన చర్చించారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.