ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh), తెలుగు సినీ పరిశ్రమ (Telugu Cinema Industry) మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం సమాచార శాఖ మంత్రి పేర్ని నానితో (Mininster Perni Nani) సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. నిర్మాతలు దిల్ రాజు దిల్ రాజు, బన్నీ వాసు, అలంకార్ ప్రసాద్ తదితరులు సచివాలయంలో మంత్రిని కలిశారు. గురువారం మంత్రివర్గ సమావేశంలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ప్రతిపాదనలను ఆమోదించిన నేపథ్యంలో నిర్మాతలు వచ్చి మంత్రిని కలవడం చర్చనీయాంశమైంది. ఐతే కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, నిర్మాతలు ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సినీరంగ సమస్యలు, ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.
కేబినెట్ నిర్ణయాలు, నాగార్జున సీఎంతో భేటీ అయిన తర్వాత రోజే సినీ నిర్మాతలు మంత్రిని కలవడం ఆసక్తికరంగా మారింది. ఐతే ప్రభుత్వం సమాచారం కోరడంతో ఇవ్వడానికి మాత్రమే వచ్చామని నిర్మాత దిల్ రాజు మీడియాకు తెలిపారు. సమావేశ వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఇదిలా ఉంటే గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణచేసే ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఏపీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెవలప్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయానికి చట్టంలో సవరణలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టికెట్ల విక్రయంపై ఇప్పటికే కమిటీ వేసిన రాష్ట్రప్రభుత్వం తాజాగా కేబినెట్ లోనూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో చట్టసవరణకు ఆమోదం తెలిపిన తర్వాత పూర్తిస్థాయి విధివిధానాలు ఖరారయ్యే అవకాశముంది. దీనిపైనే సినీ నిర్మాతలతో పేర్నినాని భేటీ అయినట్లు తెలుస్తోంది.
కొంతకాలంగా టాలీవుడ్ పెద్దలు సీఎం జగన్ తో భేటీ వాయిదా పడుతూ వస్తోంది. రెండు నెలలుగా ఈ మీటింగ్ కు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే సీఎం జగన్ తో భేటీకి టాలీవుడ్ నుంచి కేవలం నాగర్జున, మరో ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు తప్పితే ఎవరూ రాలేదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), నాగార్జున, ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli), కొరటాల శివ (Koratala Shiva), దిల్ రాజు (Dil Raju), సురేష్ బాబు వంటి పెద్దలు జగన్ ను కలిసేందుకు వచ్చారు. ఆ తర్వాత పేర్ని నాని హైదరాబాద్ వెళ్లగా చిరంజీవి నివాసంలో భేటీ జరిగింది.
ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో సినిమా టికెట్ల విక్రయంపై కొంతకాలంగా రాజకీయ దుమారం రేగుతున్న సంగతి తేలింది. జనసేన (Janasena Party) అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. (Power Star Pawan Kalyan) ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. నిర్మాతలు సినిమాలు తీస్తే ప్రభుత్వం టికెట్లు అమ్మడమేంటని పవన్ ప్రశ్నించారు. అంతేకాదు సినిమా టికెట్లపై రాబడిని చూపించి అప్పుతెచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం భావిస్తోందని అందుకే ఆన్ లైన్ సిస్టమ్ అంటోదని పవన్ ఆరోపించారు. పవన్ విమర్శలపై టాలీవుడ్ లో మిశ్రమ స్పందన వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.