Home /News /andhra-pradesh /

TOLLYWOOD HERO NARA ROHITH TWEETS ON VIZAG STEEL PLANT PRIVATIZATION NGS

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి జై కొట్టిన తొలి హీరో

విశాఖ స్టీల్ ప్లాంట్ (ఫైల్)

విశాఖ స్టీల్ ప్లాంట్ (ఫైల్)

విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రమైంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. కానీ టాలీవుడ్ హీరోలు మాత్రం స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో తొలిసారి స్టీల్ ప్లాంట్ పై కేంద్రాన్ని నిలదీశాడు ఓ హీరో

ఇంకా చదవండి ...
    విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. గత కొన్ని రోజులుగా ఆందోళనలతో విశాఖనగరం అట్టుడుకుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజా, విద్యార్థి సంఘాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు భాగమవుతున్నాయి.. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. సాధరణంగా జాతీయ స్థాయిలో ఏదైనా సమస్య ఉంటే టాలీవుడ్ స్టార్లు పోటీ పడి పడి మరి స్పందిస్తారు.. గతంలో జల్లికట్టు ఉద్యమానికి టాలీవుడ్ మొత్తం మద్దతు పలికింది. ప్రభుత్వాలు ఏవైనా కార్యక్రమాలకు పిలుపు ఇస్తే మేము సైతం అంటారు. మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నాడు కూడా మొక్కలు నాటేందుకు పోటీ పడ్డారు.. కానీ ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ పరిశ్రమపై ఒక్కరంటే ఒక్కరు కూడా టాలీవుడ్ నుంచి నోరు మెదపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

    తొలిసారి విశాఖ స్టీల్ ప్లాంట్ పై టాలీవుడ్ నుంచి ఒకరు వాయిస్ వినిపించారు. సినీ హీరో నారా రోహిత్ నిరసన బాణం ఎక్కు పెట్టారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుకు అమ్మేయడానికి అదేం అంగట్లో వస్తువు కాదంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు. కూల్చడానికది ఆవాసం కాదన్నారు. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు అని.. ఆంధ్రులు త్యాగధనులు కాబట్టే ఉక్కు పరిశ్రమ స్థాపనకు 22 వేల ఎకరాలు రాసిచ్చారని.. అలాగే 64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారని గుర్తు చేశారు.

    ఒక ట్వీట్ వెంట వరుసగా మరో రెండు ట్వీట్లు చేశారు. విశాఖ ఉక్కు సాధన కోసం 32 మంది తృణప్రాయంగా ప్రాణత్యాగం చేశారని. నేడు ఉక్కు పరిశ్రమ ఉనికి ప్రమాదంలో పడుతోందన్నారు. అందుకే ఆంధ్రుడా మేలుకో అంటూ పిలుపు ఇచ్చారు. 60వ దశాబ్ధంలో పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ 21వ శతాబ్ధంలో ప్రమాదంలో పడింది అంటూ హెచ్చరించారు.

    సమిష్టి కృషితో 50 ఏళ్లకు పైబడి అభివృద్ధి చేసుకున్న కార్మికుల శ్రమ శ్వేదం ప్రైవేటు పరం చేయడమేనా మన సాధించిన అభివృద్ధా అని నిలదీశారు. ప్రజాస్వామ్య కార్యక్షేత్రంలో పిడికిలి బిగిద్దాం. గొంతు పెగలించి విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు అని నినదిద్దాం అంటూ ట్విట్టర్ వేదికగా అభిమానులకు నారా రోహిత్ పిలుపు ఇచ్చారు.

    స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నారా రోహిత్ మినహా ఎవరూ టాలీవుడ్ నుంచి నిరసనగళం వినిపించలేదు. అందుకే టాలీవుడ్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. గతంలో ఏపీకి ఎప్పుడు సమస్య వచ్చినా హీరోలు సరిగ్గా స్పందచలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం అదే పిలుపు ఇచ్చారు.

    ఇదీ చదవండి: గంటా శ్రీనివాసరావు డిమాండ్.. అలా చేయాలంటూ పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి

    జనసేన అధినేత పవన్ తో సహా సినిమా వాళ్లంతా ఉక్కు ఉద్యమంలో ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు.. మరి నారా రోహిత్ బాటలో ఎవరైనా ముందుకు వస్తారా..? లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో మనకెందుకులే అని ఎప్పటిలా అంతా వెనుకడుగు వేస్తారో చూడాలి.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Nara rohit, Vizag Steel Plant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు