ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YSRCP) కి పక్కలో బల్లెంలా మారిన ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnam Raju) చాలా రోజుల తర్వాత ఏపీలో అడుగు పెట్టారు. తిరుపతిలో అమరావతి రైతుల సభలో పాల్గొనేందుకు రఘురామ ఏపీ వచ్చారు. తొలి నుంచి రాజధానిగా అమరావతి (Amaravathi) కి మద్దతిస్తున్న ఆయన.. రైతుల పాదయాత్రకు ఆర్ధిక సాయం కూడా చేశారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న ఆయన మరోసారి సీఎంపై పరోక్ష విమర్శలు చేశారు. అంతేకాదు రైతుల సభను రాజకీయ సభ అభివర్ణించడంపై మండిపడ్డారు. ఇది దగాపడ్డ రైతుల సభ అని.. రాజకీయ సభ కాదన్నారు. రైతుల వేదనను అర్ధం చేసుకొని ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రైతులకు మద్దతిచ్చేవారిలో రాజకీయ నాయకులుండొచ్చు.. ఇతరులు కూడా ఉండొచ్చన్నారు.
ఈ సభ తరువాత మూడు రాజధానులు గురించి మాట్లాడే వారు ఎవరు ఉండరన్న రఘురామ కృష్ణంరాజు.., నూరుకి నూరు శాతం అమరావతే రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయపరంగా అమరావతి రాజధాని ఉంటుందని.న్యాయం ఉంటుందన్న నమ్మకం పూర్తిగా ఉందన్నారు. ఇవన్నీ కూడాను కదిలే మేఘాలు లాంటివి తొలిగిపోతాయని.. అడ్డుపడే మేఘాలు అశాశ్వతమని అమరావతి అనేది శాశ్వతమని రఘురామ అన్నారు.
ఇక మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రఘురామ కృష్ణంరాజు స్పందించారు. బొత్స మాట్లాడిన మాటలు సొంత మాటలు కాదని అరువు మాటలని ఎద్దేవా చేశారు. సత్తిబాబు చెడ్డవాడు కాదు అట్లాలని మంచివాడని నేను అనటం లేదని... ఏవో చిలక పలుకులు పలుకుతున్నారంటూ తనదైన శైలిలో పంచ్ లు వేశారు. బొత్స నోటి నుంచి వచ్చిన మాటలు వేరే వ్యక్తి పలకలేక.. ఈయనతో పలికించారన్నారు. అలాంటి మాటలకు మనం జాలి పడాలి తప్ప ఆయన మాటలు విని బాధపడకూడదన్నారు.
తిరుపతిలో రైతలు సభలో పాల్గొన్న రఘురామ.. చంద్రబాబుని కలిసి ఆలింగనం చేసుకున్నారు. ఇక సభలో ప్రసంగించిన రఘురామ అమరావతి రైతుల ఉద్యమం ముందు ఎవరైనా దిగదుడుపు అని అన్నారు. అమరావతిని మార్చడం ఎవరి వల్లా కాదని.. రైతులు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ గా తీర్చిదిద్దారని.. అమరావతి రూపశిల్పి ఆయనేనని రఘురామ అన్నాారు. కొంతకాలం ఓపిక పడితే కల సాకారమవుతుందన్నారు. పాదయాత్రలో మహిళలను అవమానించినా.. భోజనం లాక్కున్నా మొక్కవోని దీక్షతో పూర్తిచేశారని రఘురామ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, MP raghurama krishnam raju, Tirupati