GT Hemanth Kumar, Tirupathi, News18
నెల్లూరు జిల్లా (Nellore District) రాజకీయాల్లో ఆయనదో ప్రత్యేక స్టైల్. పార్టీ కార్యక్రమాల్లో అయినా.... వ్యక్తిగత కార్యక్రమాల్లోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేస్తుంటారు ఆ ఎమ్మెల్యే. ఆయనే నెల్లూరు రూరల్ వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy). ఇప్పటికే ఆయనపై పార్టీ వర్గాల్లోనూ.., అధిష్టాన పెద్దల్లోనూ పలు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నెల్లూరు రూరల్ ను తన అడ్డాగా మార్చుకొని అడ్డగోలు రాయకీయాలు చేస్తున్నారని స్థానికుల్లో ఓ భావన ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.., అంతా నా ఇష్టం నేను చేసేదే చట్టం అంటూ బహిరంగంగామే మాట్లాడుతున్నారట. కోటంరెడ్డి పోకడ చూసిన పార్టీ పెద్దలు మొట్టికాయలు వేసిన ఎమ్మెల్యే స్పీడ్ కు బ్రేకులు వేయలేక పోయారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక ఈయన వ్యవహారంతో తలనొప్పులు వస్తున్నా... పార్టీ చెప్పిన మాట వినని నేతగా పేరుండటంతో ఎవరు పట్టించుకోవడం లేదని కోటంరెడ్డి వ్యతిరేక వర్గీయుల వాదన. పార్టీ కంటే తన సొంత ముద్ర ఉండాలని.., ప్రజల్లో గుర్తింపు తనకే ఉండాలనేది కోటంరెడ్డి ఆలోచన. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్తుంటారు నెల్లూరు రురల్ వైసీపీ కార్యకర్తలు. సాధారణంగా ఎమ్మెల్యే ఏమి చేయాలన్నా పార్టీ అధిష్టానం అనుమతి తప్పనిసరి. కానీ కోటం రెడ్డి రూటు మాత్రం సపరేట్.
ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు పార్టీ వ్యక్తిగా కాకుండా జెండాలేని ఇండిపెండెంట్ వ్యక్తిగా నియోజకవర్గంలో తిరిగారు. తాను చేపట్టిన పాదయాత్రలో పార్టీ జెండా లేకుండానే పాల్గొన్నారు. పార్టీ పిలుపుతో కాకుండా సొంత కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని సైలెట్ అయ్యారేమో..! అప్పట్లో పార్టీ నుంచి ఎలాంటి అడ్డంకులు రాలేదు. ఇదంతా ఓ ఎత్తు అయితే పార్టీ పేరు చెప్పడం ఇష్టం ఉందని ఆయన... చెప్పకపోయినా వచ్చే నష్టం లేదని భావించారో ఏమో గాని అనుకున్న పనినే చేసుకెళ్తుంటారు.
తాజాగా కోటంరెడ్డి చేసిన ఓ పని రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు నెలరోజులుగా అమరావతి రైతుల మహాయాత్ర జరుగుతోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల గుండా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం నేతలు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు. అధికార పార్టీ ఆ యాత్రను టీడీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రాం, పాల్గొనేవారంతా పెయిడ్ ఆర్టిస్టులని వ్యాఖ్యలు చేస్తోంది. త్వరలో మూడు రాజధానులకు సంబంధించి పకడ్బందీగా మరో చట్టాన్ని తెస్తామని కూడా చెబుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి కోసం జరుగుతున్న పాదయాత్రలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కనిపించారు. రైతులు బస చేస్తున్న శిబిరంలోకి వెళ్లిన కోటంరెడ్డి.., వారిని ఎంతో అప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా తనకు తెలియజేయాలని తాను అండగా ఉంటానని చెప్పి ఫోన్ నంబర్ సైతం ఇచ్చేశారు.
ఐతే రైతులు జై అమరావతి అని నినాదం చేయాలని, ఉద్యమ చిహ్నమైన ఆకుపచ్చ కండువా వేసుకోవాలని కోరగా.. అలా చేయలేనని తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారాయన. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండటానికి వైసీపీ వ్యతిరేకం. ఆ పార్టీలో ఉన్న అందరిదీ అదే మాట కావాలి. అదేమాట చెప్పాల్సిన శ్రీధర్ రెడ్డి... తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని.., తాను అనుకూలమైనా.. మా పార్టీ కాదు అన్నట్టు అర్ధం వచ్చేలా మాట్లాడారట.
కోటంరెడ్డి వ్యవహారం అలా పార్టీ పెద్దల చెవిలో పడిందో లేదో వెంటనే ఆరా తీసారట. పార్టీ వ్యతిరేక నిర్ణయాలకు ఎలా వెళ్లి వస్తారు అసలు ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించగా... తన ఉద్దేశం వేరని నచ్చజప్పేందుకు శ్రీధర్ రెడ్డి ప్రయత్నించారట. అయినా సంతృప్తి చెందని పార్టీ పెద్దలు మీడియా సమావేశం పెట్టి పార్టీ లైన్ దాటకుండా దాని నుంచి బయటపడేలా మాట్లాడమని చెప్పారట. ఎంత మాట్లాడినా.. ఏం చెప్పినా., జరగాల్సిన డామేజీ జరిగిపోయిందని అగ్రనేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారని టాక్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kotamreddy sridhar reddy, Nellore Dist, Ysrcp