YSRCP: చీఫ్ విప్ కు చిక్కులు తప్పవా...? సీఎం ప్రకటనపైనే ధిక్కారమా..? తిరుగుబాటుకు కారణం అదేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan mohan reddy) సొంత జిల్లా, అధికార వైఎస్ఆర్సీపీకి (YSRCP) కంచుకోట కడప జిల్లా. ఇక్కడ వైసీపీకి తిరుగులేదు. కానీ పార్టీ నేతల్లో అసంతృప్తి రాజుకుందన్న ప్రచారం జరుగుతోంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, అధికార వైఎస్ఆర్సీపీకి కంచుకోట కడప జిల్లా. ఇక్కడ వైసీపీకి తిరుగులేదు. వేరే పార్టీకి దాదాపు చోటు లేదు. కానీ ఇక్కడ వైసీపీలో వైసీపీలో అసమ్మతి రాజుకుంటుందా...? ముఖ్యంగా రాయచోటిలో తిరుబాటు మొదలైందా అంటే నిజమనే టాక్ వినిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ఒంటెద్దుపోకడలతో మరో వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎమ్మెల్యేపై తిరుగుబాటుకు ప్రజాసమస్యలనే అజెండాగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి ఏకంగా సీఎం ప్రకటనలనే వ్యతిరేకించే స్థాయికి చేరిందనే చర్చ జరుగుతోంది. మొత్తంగా రాయచోటి వైసీపీలో చేతులు కాలాకా ఆకులు పట్టుకోవాల్సిన పరిస్ధితి ఎదురైందా..? అంటే అవుననే అభిప్రాయమే నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది. అసలు ఎంటా అసమ్మతి కథ....? రాయచోటి కడప జిల్లాలో తీవ్ర కరువుతో అల్లాడే నియోజకవర్గమైనా ఇక్కడ రాజకీయాలు మాత్రం చాలా హాట్ హాట్ గా నడుస్తుంటాయి. ఎన్నికలు వచ్చినా.., రాకపోయినా ఇక్కడి రాజకీయాలు ఇలానే కొనసాగుతుంటాయి.

  గతంలో రాయచోటి కేంద్రంగా మండిపల్లి, సుగవాసి కుటుంబాల మధ్య రాజకీయ పోరు నడిచేంది. కానీ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం గడికోట, రెడ్డప్ప గారి కుటుంబాల మధ్య పోరుగా మారిపోయింది. వాస్తవానికి ఈ రెండు కుటుంభాలకు చెందిన నేతలు లక్కిరెడ్డిపల్లెకు చెందిన వారు కాగా, నియోజకవర్గాల పునర్విభజనతో వీరు అక్కడికి వలసవెళ్లడంతో రాయచోటిలో మరింత రాజకీయ వేడని రగిల్చారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎన్నికవుతూ వస్తున్నారు. ఈయన రాయచోటిలో అడుగుపెట్టిన నాటి నుంచి నియోజకవర్గ నాయకులు, నేతలతో కొందరిని కలుపుకుపోయినా.., మరికొందరి పట్ల మాత్రం పట్టువిడుపులు ప్రదర్శించినట్లు నియోజకవర్గంలో టాక్. కానీ ఇప్పుడిదే ఆయనకు మేకులా తయారవుతుందన్న అభిప్రాయం లేకపోలేదు.

  గడికోట శ్రీకాంత్ రెడ్డి (ఫైల్)


  ఇక రాయచోటి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి తనయుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాస్ లీడర్ గా గుర్తింపుతెచ్చుకున్నారు. ఈయనను నియోజకవర్గంలో మాస్ లీడర్ గాను, రాముడు అంటూ పిలుచుకుంటుంటారు. మండిపల్లి నాగిరెడ్డి మరణానంతరం ఆ కుటుంబం పదవులకు దూరమవుతూ వచ్చింది. నాగిరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా నాగిరెడ్డి కుటుంబాన్ని మళ్లీ పదవులు వరించలేదు. కానీ నాగిరెడ్డి తనయుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాత్రం వైఎస్ కుటుంబంతో సన్నిహితంగానే ఉన్నారు. వైసీపీ ఆవిర్భవించిన అనంతరం 2009లో కాంగ్రెస్ తరుపున ఉప ఎన్నికల్లో పోటీచేశారు. అప్పుడు వైసీసీ తరుపున గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రాముడు వైసీపీకి అనుకూలంగానే ఉన్నా..., ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం పోటీచేయలేదు.

  మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (ఫైల్)


  ప్రతిసారీ ఎన్నికల ముందు పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా అవకాశం మాత్రం రావడం లేదు. ఇదే విధంగానే 2019లోను చేసినా ఫలించకపోవడంతో సైలెంట్ గా ఉంటున్నారు. కానీ గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి నుంచి పోటీ చేసిన నాటి నుంచి కూడా రాముడుతో మంచి సంబంధాలు లేవన్న అభిప్రాయమే ఉంది. నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు పలువురు నాయకులతోను చాలా వరకు ప్రస్తుత శ్రీకాంత్ రెడ్డి అంటిముంటన్నట్లుగానే వ్యవహరించారన్న అభిప్రాయముంది.

  శ్రీకాంత్ రెడ్డి దూరంపెట్టిన ప్రముఖుల్లో రాముడు పేరే వినిపిస్తుంది. పదవి లేదు.., ప్రాధాన్యత లేదు. పార్టీ కార్యక్రమాల్లో గానీ, ప్రముఖుల పర్యటనల్లో గానీ రాముడి ప్రస్తావన లేకుండా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేస్తున్నారన్న అసంతృప్తి ఉంది. గత యేడాది డిసెంబర్ 24న సీఎం వైఎస్ జగన్ రాయచోటికి వచ్చినా రాముడికి ప్రాధాన్యత దక్కలేదు. ఆయన అనుచరులకు కనీసం పాసులు కూడా ఇవ్వకపోవడంతో రాముడు నేరుగా హెలీపాడ్ వద్దకు వెళ్లి సీఎం ను కలిసి అటునుంచి అటే వెళ్లిపోయారని సమాచారం. అలాగే రాముడి పేరు మీద ఎవైనా ప్రతిపాదనలు వచ్చినా, ఎవరైనా ఆయన సిఫార్సుతో పనుల కోసం వచ్చినా చెయ్యవద్దని నియోజకవర్గ అధికారులకు, పార్టీ నేతలకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. కనీసం పోలీసు స్టేషన్ లలోను రాముడి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్న అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం ఉంది.

  ఈ నేపధ్యంలోనే రాయచోటిలో ప్రభుత్వ కళాశాలకు చెందిన 4 ఎకరాల స్ధలం వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలంటూ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చెప్పడం, సీఎం వెంటనే ఆ స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు ఇస్తూ ప్రకటన చెయ్యడం రాయచోటి ప్రజానీకానికి ఆగ్రహం తెప్పించింది. అసలే అసంతృప్తిగా ఉన్న రాముడు ఇదే స్ధలం పరిరక్షణ పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాసంఘాలను, విపక్షాలను, ముస్లిం మైనార్టీలను కలుపుకుని ఏకంగా చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి తనలోని అసంతృప్తిని, ఆగ్రహాన్ని నిరసన రూపంలో చాటుకున్నారంటూ ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద చర్చ నడుస్తోంది.

  మొత్తంగా ఎమ్మెల్యేగా తన పట్ల చూపిన చిన్నచూపుకు ప్రభుత్వ నిర్ణయాలను, ఏకంగా సిఎం ప్రకటననే వ్యతిరేకిస్తూ శ్రీకాంత్ రెడ్డిపై అస్మమతి అస్త్రాన్ని సంధించడం రాముడు రెబల్ అంటూ ప్రచారం సాగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఒకవేళ మరోసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే రెబల్ అభ్యర్ధులను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారన్న ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది. మొత్తంగా ఎమ్మెల్యే పైన ఉన్న అసమ్మతి చివరకు ఇలా చిలికి చిలికి గాలి వానల మారింది. మరి ఈ గాలి వీన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందొ వేచి చూడాలి.

  GT Hemanth Kumar, Tirupati Correspondent, News18
  Published by:Purna Chandra
  First published: