YCP MLA vs TTD Chirman: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలోని విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. ఎక్కడో ఒక దగ్గర విబేధాలు బయటపడుతునే ఉన్నాయి. ఇప్పుడు ఆ విబేదాలు పవిత్ర పుణ్యక్షేత్రం.. కలియుగ వైకుంఠం తిరుమలకు కూడా తాకాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్ టీటీడీ చైర్మన్ గా మారింది. అసలు ఇంతకీ ఏమైంది అంటే..? తిరుమలలో దర్శనం సందర్భంగా తనకు గౌరవం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మండిపడ్డారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలను టార్గెట్ చేస్తూనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీ వాళ్ళకు, మీ చుట్టాలకు ఒక చట్టం.. ఇతరులకో చట్టమా..? అని ఘాటుగా మండిపడ్డారు. టీటీడీ అంటే మీ ఎస్టేట్ అనుకున్నారా? సిఎంవో సిఫారసును కూడా కాదంటారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. టీటీడీ ఈఓ ఒంటెత్తు పోకడపై రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనాలు, సౌకర్యాల కల్పనలో ప్రోటోకాల్ ప్రక్రియను టిటిడి ఈఓ,ఇతర అధికారులు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరు ఒంటెత్తు పోకడతో,తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి తీరు కారణంగా.. ఇటు టిటిడికి,అటు ప్రభుత్వ పెద్దలకు చెడ్డ పేరు వస్తోంది అన్నారు. ఇక్కడ అధికారులు చర్యలు చూస్తుంటే..? ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు పని చేస్తున్నారని టిటిడి ఈఓ ధర్మారెడ్డిపై విరుచుకుపడ్డారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించడాన్ని తాము స్వాగతిస్తామన్నారు. అయితే ఏ నిబంధననైనా, ఏ కార్యక్రమమైనా తిరుమలలో పారదర్శకంగా జరిగితే సంతోషిస్తామన్నారు. అలాగే స్వాగతిస్తామన్నారు. కానీ తిరుమలలో అలా జరగటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ దర్శనాలు, సౌకర్యాల విషయంలో ఈఓ తన వారిని ఒక రకంగా,ఇతరులను ఇంకో రకంగా, అవమానకరంగా చూడడమేంటని నిలదీశారు అన్నా రాంబాబు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. విమర్శలు చేయడానికే వీఐపీలు తిరుమలకు వస్తే ఏమీ చేయలేమన్నారు. ఆ ఎమ్మెల్యే 28 మందిని తీసుకొచ్చారని.. అందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలంటే కుదరదు అని తేల్చి చెప్పేశారు. అయినప్పటికీ 18 మందికి ప్రోటోకాల్ కేటాయించారన్నారు. వీఐపీలకు నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా టీటీడీపై విమర్శలు చేస్తే ఏమీ చేయలేం అన్నారు వైవీ సుబ్బారెడ్డి.
ఎఫ్ఆర్సీఏ నిభందనలకు విరుద్దంగా విదేశాల నుండి విరాళాలు స్వీకరించినందుకు టీటీడీకి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కోట్ల జరిమానా వేసిందని, ఆ జరిమానాను కట్టేశామని తెలిపారు. త్వరలో విదేశాల నుండి ఎఫ్ఆర్సీఏ లైసెన్స్ ద్వారా విరాళాలు తిరిగి తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. టీటీడీకి ఉన్న ఎఫ్ఆర్సీఏ లైసెన్స్ కాలపరిమితి ముగియడంతో… రెన్యూవల్ చేయాలని ఆర్బీఐని కోరినట్లు తెలిపారు. హుండీలో కానుకల ద్వారా టీటీడీ ఖజనాలో 30 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ ఉందని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, YV Subba Reddy