GT Hemanth Kumar, News18, Tirupati
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజధాని రాజకీయం తారాస్థాయికి చేరుతోంది. మూడురాజధానులకు మద్దతగా వైసీపీ (YSRCP) ఆయా ప్రాంతాల్లో భారీ ప్రదర్శనలు చేపడుతోంది. విశాఖపట్నం (Visakhapatnam) లో గర్జన తర్వాత.. ఇప్పుడు రాయలసీమ (Rayalaseema) లో అలాంటి కార్యక్రమమే జరిగింది. శనివారం తిరుపతి (Tirupati) వేదికగా నిర్వహించిన రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు భారీగా తరలివచ్చారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటుతోనే స్థానికంగా అభివృద్ధి సాధ్యపడుతుందని, రాజధాని ఏర్పాటుతో పాటు హక్కుల సాధన కోసం చేపట్టిన ఆత్మగౌరవ మహా ప్రదర్శనలో ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు సీఎం జగన్ పూర్తి సముఖంగా ఉన్నారని, కానీ చంద్రబాబు తన దుష్టశక్తులతో వికేంద్రీకరణపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు ఈ మహాగర్జన నిలువుటద్దంగా మారిందన్నారు భూమన. హక్కుల సాధన కోసం ఈ ర్యాలీ కేవలం ప్రారంభం మాత్రమేనని హెచ్చరించారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాయలసీమకు ఏం చేశారని ప్రశ్నించారు. విశాఖలో పరిపాలనా రాజధాని కోసం ప్రజలు ఏ విధంగా కట్టుబడి ఉన్నారో రాయలసీమలో న్యాయ రాజధాని కోసం ప్రజలు అంతే చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు. రాయలసీమ ప్రజల కన్నీటి రూపం ఆత్మగౌరవ యాత్ర పేరుతో బయటపడిందని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు గుర్తించాలని కోరారు. హైదరాబాద్ వల్ల ఇటు రాయలసీమకు అటు ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని.., అమరావతి పేరుతో మళ్లీ అదే వంచన చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాయలసీమ ఆత్మ గౌరవ యాత్ర స్వార్ధ రాజకీయాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం పాకులాడుతున్న దుష్టచతుష్టయానికి చెంపపెట్టని విమర్శించారు. రాయలసీమ మొదటి నుంచి వివక్షకు గురైందని, న్యాయ రాజధాని ఏర్పాటుతో మాత్రమే అభివృద్ధి సాధ్యపడుతుందని వివరించారు. రాయలసీమలోని టీడీపీ నేతలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
రాయలసీమ ఆత్మగౌరవ ర్యాలీలో లక్ష మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని.., దీన్ని బట్టి వికేంద్రీకరణపై ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వికేంద్రీకరణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అత్యవసరమని.., ప్రజల ఆకాంక్షల మేరకే సీఎం జగన్ పనిచేస్తారని ఆయన చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Three Capitals, Tirupati