తిరుపతి ఉపఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైంది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు. ఇప్పటికే గురుమూర్తి ఆధిక్యం 2లక్షల 30వేలు దాటింది. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు కేవలం లక్షా 70వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి. మెజారిటీ విషయంలోనూ వైసీపీ దూసుకుపోతోంది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లను గురుమూర్తి సొంతం చేసుకుంటున్నారు. 2019లో దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ సాదించిన 2లక్షల 28వేల 376 ఓట్ల మెజారిటీ ఆయన అధిగమించారు. ఇప్పటికే గురుమూర్తికి ఏకంగా 5.33 లక్షల ఓట్లు పోలయ్యాయి. పనబాక లక్ష్మికి దాదాపు 3 లక్షలు రాగా.. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50వేల ఓట్లు దక్కాయి. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ దూసుకుపోతోంది. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రావాలని వైసీపీ భావించినట్లే.. గురుమూర్తి మెజారిటీని క్రాస్ చేశారు.
తిరుపతి అర్బన్ తో పాటు శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైసీపీ హవా చాటింది. ఈ స్థాయిలో మెజారిటీ రావడంపై గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన, సీఎం వైఎస్ జగన్ ఛరిష్మా రెండు కళ్లుగా ఈ గెలుపుకు దోహదపడ్డాయని ఆయన అన్నారు. ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని.. ప్రజల్లో ఇతర పార్టీల పరిస్థితి ఏంటనేది వారికొచ్చిన ఓట్లను బట్టే తెలుస్తోందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.