GT Hemanth Kumar, News18, Tirupati
ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నాడు ఓ వ్యక్తి. భార్య చేస్తున్న వెకిలి చేష్టలు చూసి చేస్తున్న పని వదిలి దూరంగా వెళ్ళిపోయాడు. బెంగళూరులో తనకు వచ్చిన పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇంతలోనే భార్య తన ప్రియుడితో కలిసి తీసుకున్న సెల్ఫీని ఫేస్ బుక్ లో చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే RIP అంటూ అదే పోస్టును షేర్ చేశాడు. ఆ తర్వాత జరిగిన ఘటనను అతను కూడా ఊహించలేకపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి చిత్తూరు జిల్లా (Chittoor District) చంద్రగిరి మండలంలోని ఏ.రంగంపేటకు చెందిన వంశీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవాడు. ఈ క్రమంలో తెలంగాణలోని కరీంనహగర్ కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.
వంశీ ఆటో నడుపుతూ భార్యను పోషిస్తుండేవాడు. తిరుపతి రూరల్ ముస్లిం పేటకు చెందిన ఆటో యజమాని డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి తరచూ వంశీ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో వంశీ భార్యతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వంశీ ఇంట్లో లేని సమయంలో అన్వర్.. వంశీ భార్య వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. విషయం చుట్టుపక్కల వాళ్ల ద్వారా వంశీ చెవిన పడింది. ఇదే విషయంపై వంశీ.. భార్యను నిలదీశాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోతున్నానని చెప్పి.. అన్వర్ దగ్గరకు వెళ్లింది. విషయం తెలిసిన వంశీ.. ఆటో నడపటం మానేసి బెంగళూరు వెళ్లిపోయాడు.
అయితే నెలన్నర క్రితం భార్య ఫేస్ బుక్ పేజీలో మరో వ్యక్తితో ఉన్న ఫోటోను వంశీ చూశాడు. వెంటనే ఫిబ్రవరి 13న తన భార్యతో పాటు అన్వర్ కూడా చనిపోయాడంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఫేస్ బుక్ పోస్ట్ చూసి తట్టుకోలేకపోయిన అన్వర్.. తన ఫ్రెండ్స్ తో కలిసి బెంగళూరు వెళ్లి వంశీని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి చంద్రగిరిలో బంధించాడు. అక్కడ వంశీని చిత్రహింసలు పెట్టారు. బైక్ సైలెన్సర్ తో వంశీ ఒళ్లంతా కాల్చారు. అతడి తలపై మూత్రం పోసి.. గుండుకొట్టించి వీడియో తీశారు.
అన్వర్ అనే వ్యక్తిపై తప్పుడు పోస్ట్ పెట్టినందుకు ప్రాయశ్చిత్తంగా గుండు కొట్టించుకున్నట్లు వంశీతో బలవంతంగా చెప్పించి వీడియో తీశారు. ఐతే అన్వర్ చేసిన దురాగతం వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు రాకపోయినప్పటికీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో వంశీ భార్య పాత్రపైనా ఆరా తీస్కున్నారు. ప్రస్తుతం నిందితుడు అన్వర్ తో సహా అతడి స్నేహితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Extramarital affairs, Local News, Tirupati