Live in Relationship: ఈ రోజుల్లో వివాహ బంధానికంటే.. ఆ బంధాన్ని దూరం చేసే సాన్నిహిత్యాలకే కొందరు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాత్కాలిక సుఖాలు, ఆకర్షణల మాయలో పడి అందమైన కుటుంబాలను దూరం చేసుకుంటున్నారు. అలా ప్రియుడి మోజులో పడి అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను, పేగుతెంచుకొని పుట్టిన కన్నబిడ్డలను కాదనుకొని వెళ్లిపోయిన ఓ మహిళ చివరికి తాను కోరుకున్న, కావాలనుకున్నవాడి చేతిలోనే దారుణంగా మోసపోయింది. అంతేనా ఊహించని విధంగా ప్రాణాలు పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ లోని కడప (Kadapa) నగరంలోని దేవుని కడప ప్రాంతానికి చెందిన యశోద(29) అనే మహిళకు పది సంవత్సరాల క్రితం జయశంకర్ అనే వ్యక్తితో పెళ్లైంది. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో యశోదకు నిత్యపూజయ్య అలియాస్ సురేషఅ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం (Extramarital Affair) ఏర్పడింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఆమె భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. అతడితో కలిసి దేవుని కడపలోని ఓ ఇంట్లో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తోంది.
కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని యశోద.. నిత్యపూజయ్యను నిలదీస్తోంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఐతే యశోదను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని నిత్యపూజయ్య ఆమెను మట్టుబెట్టాలని స్కెచ్ వేశాడు. అనుకున్నదే తడవుగా ఈనెల 23న రాత్రి యశోద నిద్రపోతున్న సమయంలో ఆమె ముఖంపై దిండుతో అదిమిపెట్ట హత్య చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తర్వాతి రోజు యశోద చెల్లెలు గోవిందమ్మ ఫోన్ చేసినా సాయంత్రం వరకు స్పందన లేకపోవడంతో ఇంటికి వెళ్లి స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా యశోధ అచేతనంగా పడి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న యశోద ప్రియుడు నిత్యపూజయ్య కోసం గాలిస్తున్నారు.
ఇలాంటి ఘటనే కడప నగరంలో చోటు చేసుకుంది. ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఓ యువతి అనమానాస్పదరీతిలో ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన అంటోనీ గీత అనే యువతి.. కడప నగరంలోని నాగరాజుపేటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో అనిల్ కుమార్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. వీళ్లిద్దరూ గతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని భావించారు.
ఐతే ఇద్దరి ఇళ్లలో పెళ్లికావాల్సిన పెద్దవాళ్లుండటంతో కొన్నాళ్లు ఆగుదామని భావించారు. ఇదిలా ఉంటే ఇద్దరూ ఒకే ప్రాంతంలో పనిచేస్తుండటంతో అనిల్ కుమార్ రిమ్స్ పోలిస్ స్టేషన్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇద్దరూ ఆ ఇంట్లోనే సహజీవనం చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అనిల్ కు గీతపై అనుమానం వచ్చింది. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తనను మోసం చేస్తున్నావని.. చచ్చిపో అంటూ గీతను టార్చర్ చేశాడు. అనిల్ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన గీత.. అతడు ఇంట్లోలేని సమయంలో ఇంటిపైకి వెళ్లి ఇంజక్షన్ ద్వారా విషం ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Extramarital affairs, Illegal affairs, Kadapa, Murder