GT Hemanth Kumar, Tirupathi, News18
అడవికి రారాజైన సింహం గర్జనలు ఓ వైపు.. గజరాజుల ఘింకారాలు మరోవైపు.... పక్షుల కిలకిలలు.... నెమళ్ళ నాట్యాలు.... ఇలా అనేక వన్యప్రాణులను చూడాలంటే మనం జూకి వెళ్లాల్సిందే. ఆధ్యాత్మిక యాత్రకు ఇలాంటి అదనపు ఆనందం తోడైతే చాలా బావుటుంది. ఆధ్యాత్మిక నగరి తిరుపతి (Tirupathi) లో ఎన్నో వింతలు, మరెన్నో అద్భుతాలు.. ఒకవైపు ప్రకృతి అందాలు, స్వేచ్చగా తిరిగే జంతువులు సందర్శకులకు అంతులేని మధుర స్మృతులను అందిస్తాయి. స్థానికులతో పాటు శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన వారు ఎస్వీ జూపార్క్ (SV Zoo Park) ను సందర్శిస్తుంటారు. నిత్యం వేలాది మంది సందర్శకులతో కిటకిటలాడుతూ సందడిగా ఉంటుంది జూపార్క్. ఐతే ఇదంతా కరోనా (Corona) రాక ముందు వరకే. ఒకప్పుడు కళకళలాడిన ఈ జూ కరోనా ప్రభావంతో ఇప్పుడు వెలవెలబోతోంది.
కరోనా మహమ్మారి కారణంగా మానవాళే కాదు.. మూగజీవాలు కూడా అల్లడిపోయాయి. ఆకలితో అలమటించిపోయాయి. ఇందుకు తిరుపతి జూపార్క్ ఒక నిదర్శనం. ఆసియాలోనే శ్రీ వెంకటేశ్వర జూపార్కు విస్తీర్ణంలో చాలా పెద్దది. మొత్తం 1,250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జూపార్కులో మొత్తం 1145 రకాల జంతువులు, వివిధ రకాల పక్షులు, సర్పాలు ఉన్నాయి. సింహాల గర్జనలు, పులులు గాండ్రింపు, ఏనుగుల ఘీంకారాలు, పక్షులు కిలకిలలు, బుసలు కొట్టే సర్పాలను వీక్షించి ముసిరి పోయే సందర్శకులతో కళకళ లాడేది. కరోనా మహమ్మారి మానవాళిని చిన్నాభిన్నం చేసినట్లే.. జూలోని జంతువుల పొట్టకొట్టింది.
కరోనా ఫస్ట్ వేవ్ లో దాదాపు మూడు నెలల పాటు జూని మూసివేశారు. సెకండ్ వేవ్ లోనూ ఓ రెండు నెలల పాటు మూతబడింది. దీంతో జూ పార్క్ ఆదాయానికి భారీగా గండిపడింది. ఆలాగే జూపార్క్ లోని జంతువులకు దాతలు అందించే ఆర్ధిక సాయం, ఆహారం సరఫరా కూడా నిలిచి పోయింది. దీంతో మూగ జీవాల నిర్వహణ అధికారులకు మరింత కష్టతరంగా మారింది.
కరోనాకు ముందు వరకూ ఏడాదికి ఆరు లక్షల మందికి పైగా సందర్శకులు వస్తుండేవారు. వారి ద్వారా నెలకు దాదాపు యాభై లక్షల చొప్పున ఏడాదికి రూ.6కోట్ల వరకూ ఆదాయం సమకూరేది. కరోనా కారణంగా జూపార్కును మూసివేయడంతో సుమారు 3.5 కోట్ల రూపాయల వరకూ నష్టం వాటిల్లింది. సందర్శకుల ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు తొంభై శాతం వరకూ జూపార్క్ లోని జంతువుల పోషణకు, వాటి నిర్వహణకు కేటాయించే వారు. ఐతే ప్రస్తుతం అవి అర్ధాకలితో అలమటించే పరిస్ధితి ఏర్పడింది. అంతే కాకుండా కరోనా కారణంగా సెంట్రల్ జూ పార్క్ నుండి వచ్చే ఆర్ధిక సాయం సైతం నిలిచి పోయింది. దీంతో గత ఏడాది టిటిడి రూ.50లక్షలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.50 వరకూ జూపార్క్ కు ఆర్ధిక సాయం అందించాయి.
ఇది చదవండి: 900 ఏళ్లనాటి వీరుల వైభవం.. పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు..
కరోనా భయంతో సందర్శకుల తాకిడి రోజురోజుకీ పడిపోతుండటంతో జూపార్క్ ను ఏవిధంగా నిర్వహించాలో అధికారులకు అర్ధం కావడం లేదు. దీంతో అధికారులు ఎవరైనా జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు జంతువులను దత్తత తీసుకునేందుకు ముందుకురావాలని కోరుతున్నారు. గతంలో మాదిరిగానే దాతలు ముందుకు వచ్చి వాటికి ఆహారాన్ని అందించే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాంటివారు ఎవరైనా ఉంటే 9440810068 నంబర్ ను సంప్రదించాలని ఎస్వీ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ హిమశైలజా కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirupati