పెళ్లి (Marriage). రెండు జీవితాలను ఏకం చేస్తుంది. కష్టసుఖాల్లో ఇద్దరూ పాలుపంచుకుంటూ కలిసి జీవించే ప్రయాణానికి పెళ్లి పునాది. పెళ్లైన దంపతులు అన్ని వేళలా ఒకరికి ఒకరు తోడుంటారు. మూడుముళ్ల బంధంతో ఒకటై భర్త వెంట నడిచిన భార్య... ఎన్నికష్టాలు ఎదురైనా అతడితోనే ఉంటుంది.అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వెంటనే భర్త మాట మారిస్తే.. నువ్వునాకొద్దు అని బాంబు పేల్చితే. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లాలో (Chittoor District) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలం,అంగళ్ళకు చెందిన కళావతికి, మదనపల్లె మండలం, గుండావారిపల్లెకు చెందిన రామాంజులుతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం అయినప్పటి నుండి భార్యకు ఏ కష్టం రానీయకుండా చూసుకున్నాడు రామాంజులు. వీరి అన్యోన్య దాంపత్యానికి నిదర్శనంగా నలుగురు పిల్లలు పుట్టారు.
పెళ్లైనప్పటి నుంచి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ భార్య బిడ్డలతో కలిసి హాయిగా జీవనం సాగించిన రామాంజులు. గత ఏడాది సి.ఆర్.పి.ఎఫ్ కానిస్టేబుల్ (CRPF Constable) గా ఎంపికయ్యాడు. దీంతో ఇన్నాళ్ళు తాము పడిన కష్టాలన్ని మరిచిపోయిన కళావతి.. భర్తకు ఉద్యోగం వచ్చిన శుభవార్తను బంధు, మిత్రులకు చెప్పుకొని సంబరపడిపోయింది. కానీ ఆమె ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చిన రామాంజులు తాను రెండో పెళ్ళి చేసుకుంటున్నానని కళవతికి షాక్ ఇచ్చాడు. తనను ఆట పట్టించేందుకు తన భర్త ఇలా చెబుతున్నాడని కళావతి భావించింది.
ఇది చదవండి: అమ్మాయిలు ఇలాంటి వాళ్లనే ఎందుకు నమ్ముతారో..! ప్రేమ పేరుతో సర్వం దోచేశాడుగా..!
ఇలా కొద్దికాలం గడిచిన తరువాత కళావతితో తరచూ గొడవపడే వాడు. బిడ్డలతో సహా ఇంటి నుండి బయటకు వెళ్ళాలని కళావతిని వేధింపులకు గురిచేసేవాడు. ఇదే విషయంను కళావతి తల్లిదండ్రులు, బంధువులకు చెప్పింది..దీంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. పెద్దలు ఎంతలా నచ్చజెప్పె ప్రయత్నం చేసినా రామాంజులు మాత్రం పట్టించుకోలేదు. కళావతితో కాపురం చేసేది లేదని తెగేసి చెప్పాడు. తనకు, బిడ్డలకు అన్యాయం చేయద్దని కళావతి ప్రాధేయ పడినా రామాంజుల మనస్సు కరగలేదు. కళావతిని, నలుగురు చిన్నారులను నిర్ధాక్షిణ్యంగా రోడ్డుపైకి గెంటేశాడు.
తను ప్రేమించిన మరో మహిళను పెళ్లి చేసుకుంటానని మీతో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ తేల్చి చెప్పేశాడు. దీంతో చేసేది లేక ఆ మహిళ నలుగురు పిల్లలను తీసుకుని పుట్టింటికి చేరుకుంది.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా తను తన నలుగురు పిల్లలను ఎలా పోషించు కోవాలంటూ కన్నీరుమున్నీరవుతోంది. ఐతే గ్రామస్తుల సలహాతో తన నలుగురు పిల్లలతో కలిసి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది. సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇన్నాళ్లూ భార్యతో కాపురం చేసిన రామాంజులు ఇలా చేయడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. అతడు ఉద్యోగం సాధించడంతో భార్యపాత్ర కూడా ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Tirupati, Wife and husband