GT Hemanth Kumar, Tirupati, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాష్ట్ర ప్రభుత్వం (AP Government) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర పౌరసేవలు వాలంటీర్ వ్యవస్థ (Volunteers System) ద్వారా ప్రజల ఇంటి వద్దకే చేరుతున్నాయి. ప్రభుత్వ పథకాలు (Government Schemes), రేషన్ కార్డులకు (Ration Card) సంబంధించిన ఈకేవైసీ (e-KYC) వంటివి వాలంటీర్లే చేస్తున్నారు. ఇళ్లదగ్గరే లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించి పథకాలు అందిస్తున్నారు. అమ్మఒడి నుంచి పెన్షన్, ఇతర పధకాల వరకు వీరి సర్వే ఆధారంగానే అర్హులను ఎంపికచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వాలంటీర్లు అందరికి నూతన సాంకేతిక పరిజ్ఞానం జోడించిన మొబైల్ ఫోన్ లను అందించింది ఏపీ ప్రభుత్వం. తద్వారా వారు ప్రజల బయోమెట్రిక్, ఆధార్ లింక్, లొకేషన్ మ్యాపింగ్ వంటి పనులను చేస్తుంటారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ సదుపాయాన్ని కొందరు వాలంటీర్లు సాంకేతిక పరిజ్ఞానానికి తమ తెలివిని జోడించి అవకతవకలకు పాల్పడుతున్నారు. ఇలా ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి నగదును వారికీ తెలియకుండానే స్వాహా చేసేస్తున్నారు
తాము చేసింది ఎవరూ గుర్తించరు.. చదువురాని వారికి అస్సలు తెలియదునుకున్న ఓ వాలంటీర్ ప్రభుత్వ పధకాల పేరుతో తరచు బయోమెట్రిక్ వేయించుకొని జనం సొమ్ము లక్షకుపైగా దోచేశాడు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కలికిరి మండలం పత్తేగడ పంచాయితీ పల్లెల్లవారి పల్లెకు చెందిన కొందరి ఖాతాల్లో నగదు తెలియకుండానే వేరేవాళ్లకి ట్రాన్స్ ఫర్ అవుతోంది. ఇది గమనించిన ఇందమ్మ అనే మహిళ.. భర్తసాయంతో బ్యాంకు అధికారులను సంప్రదించింది. అక్కడి సిబ్బంది ఇచ్చిన సమాధానానికి షాక్ తప్పలేదు.
నవకుమార్ అనే వ్యక్తి బయోమెట్రిక్ ద్వారా ఎకౌంట్ నుంచి నగదు బదిలీ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతడు గ్రామ వాలంటీర్ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రభుత్వ పథకాల పేరుతో లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకునే సమయంలో సదరు వేలిముద్రలను ఓ యాప్ ద్వారా సేకరించి వాటిని దుర్వినియోగం చేస్తున్నాడు. గ్రామంలో మరికొంతమంది ఎకౌంట్ల నుంచి రెండు వేలు, మూడు వేలు చొప్పున ఇలా దాదాపు లక్షరూపాయలకు పైగా స్వాహా చేసినట్లు గుర్తించారు.
దీనిపై గ్రామస్తులు వాలంటీర్ ను నిలదీయగా తప్పైపోయిందని అందరి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. తాను విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలోని చాలా మంది ఎకౌంట్ల నుంచి వాలంటీర్ నవకుమార్ డబ్బులు స్వాహా చేసినట్లు సమాచారం. ఐతే మరికొందరు మాత్రం అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.
సంక్షేమ పథకాల అర్హుల నమోదుకు నాలుగైదుసార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తుండటంతో వాలంటీర్లు అడగ్గానే జనం వేలిముద్రలు వేసేస్తున్నారు. అయితే ఎలాంటి యాప్ లో బయోమెట్రిక్ తీసుకుంటున్నారో చదువుకున్నవారు కూడా పసిగట్టలేక పోతున్నారు. సరిగ్గా దీన్నే నవకుమార్ అవ కాశంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇలాంటి పనులు నవకుమార్ మాత్రమే చేస్తున్నాడా...? లేక ఇతర వాలంటీర్లు చేస్తున్నారా..? కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cheating, Chittoor, Crime, Gram volunteer, Tirupati