GT Hemanth Kumar, News18, Tirupati
యాంత్రిక యుగంలో అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం అవుతున్నాయి. మనమేమి నేర్చుకోవాలన్నా ఇంటి పట్టునే ఉంటూ... ఎలాంటి ఫీజు లేకుండా సూలువుగా నేర్చుకోవడమే కాదు వాటిని తయారు చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో వంటల నుంచి వివిధ ఇంజనీరింగ్ డిజైన్స్ వరకు అంతా ఆన్లైన్ లొనే లభ్యం అవుతున్నాయి. ఆన్ లైన్ క్లాసులు.., ఆన్ లైన్ షాపింగ్ అంటూ సర్వం ఆన్ లైన్ మయంగా మారిపోయాయి. నేర్చుకోవాలన్న తపన ఉంటే యూట్యూబ్ ద్వారా ఎలాంటి తయారీ విధాననైనా ఇట్టే తెలుసుకోవచ్చు. యూట్యూబ్ లో ఉన్న వీడియో లు ఆధారంగా కొందరు మంచి పనులు చేస్తుంటే.... మరి కొందరు మాత్రం చెడుదారులు ఎంచుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) గంగాధర నెల్లూరు గ్రామ వలంటీర్ నిర్వాకం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. గ్రామ వలంటీర్ల వ్యవస్థ రాష్ట్రంలో ఓ మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటింటికీ వెళ్లి అందించేందుకు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కానీ ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ కొందరు వలంటీర్ల తీరు మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. కొందరు వలంటీర్లు మద్యం అక్రమ వ్యాపారం చేయిస్తూ పట్టుబడితే.. మరికొందరు అడవుల నుంచి కట్టెలను కొట్టి అమ్మడం.. నాటు సారా తయారీ.., ఇసుకను అమ్మడాన్ని చూసి షాక్ అయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అలా ఓ వలంటీర్ నిర్వాకం తీవ్ర అలజడికి సృష్టించింది.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం చింతతోపు ఎస్టీ కాలనీకి చెందిన రవి (32) కార్వేటినగరం-3 సచివాలయలో వలంటీరుగా విధులు నిర్వహిస్తున్నాడు. రవి నివాసం ఉంటున్న కాలనీ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. అక్కడికి వివిధ జంతువులు వస్తుంటాయి. దీంతో వాటిని వేటాడలని రవి నిశ్చయించుకున్నాడు. దీంతో కొద్దిరోజుల కిందట ఓ పాత నాటు తుపాకీని కొనుగోలు చేశాడు.. అది పాతది కావడంతో వేట సాధ్యమయ్యేది కాదు. వేటకు వెళ్లిన సమయంలో తుస్సుమనేది. ఆ పాత నాటు తుపాకీతో వేటకు వెళ్లడం సాధ్యం కాదని అనుకున్న రవి కొత్తది తయారు చేయాలనుకున్నాడు.
వెంటనే రంగంలోకి దిగి యూట్యూబ్‌లో తుపాకీ తయారు చేసే విధానాన్ని సెర్చ్ చేసి చూశాడు. ఒకటి పలుమార్లు వివిధ యూట్యూబ్ వీడియోలు చూసి అవసరమైన పరికరాలను కొన్నాడు. తుపాకీ తయారీ చేపట్టి పూర్తి చేస్తున్న క్రమంలో చుట్టుపక్కల వారికి తెలిసిపోయింది. దీంతో ఆ సమాచారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ దస్తగిరి బుధవారం సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో రెండు నాటు తుపాకులు, తయారీకి ఉపయోగించిన టూల్ కిట్లను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor