TIRUPATI UKG STUDENT MADE A COMPLAINT TO POLICE ABOUT TRAFFIC PROBLEMS IN PALAMANERU TOWN OF CHITTOOR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Viral Video: మా ఏరియాలో ట్రాఫిక్ క్లియర్ చేయండి.. పోలీసులకు బుడతడి కంప్లైంట్..
సీఐతో మాట్లాడుతున్న కార్తికేయ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పలమనేరు అర్బన్ పీఎస్ కు ఓ బుడతడు వెళ్లి హల్ చల్ చేశాడు. తనకు ఎదురవుతున్న సమస్యపై ఏకంగా సీఐకి కంప్లైంట్ ఇచ్చాడు.
ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. న్యాయం కోసం తొలుత పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లాలనే ఆలోచన పెద్దలకే వచ్చింది. ఐతే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) పలమనేరు అర్బన్ పీఎస్ కు ఓ బుడతడు వెళ్లి హల్ చల్ చేశాడు. తనకు ఎదురవుతున్న సమస్యపై ఏకంగా సీఐకి కంప్లైంట్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. పలమనేరుకు చెందిన మోహన్ అనే వ్యక్తి కుమారుడు కార్తికేయ.. స్థానికంగా ఓ స్కూల్లో యూకేజీ చదవుతున్నాడు. ప్రతి రోజూ స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఎంబీటీ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవుతోంది. డ్రెయినేజీలు మరమ్మతులు చేసేందుకు జేసీబీతో పాటు ట్రాక్టర్ కూడా రోడ్డుకు అడ్డంగా ఉంటోంది. దీంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీంతో కార్తికేయకు విసుగొచ్చిందో ఏమో.. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. మా స్కూల్ దగ్గర జేసీబీతో రోడ్డును తవ్వేసి ట్రాక్టర్లు అడ్డుగా పెట్టారని.. పోలీసులంతా వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయాలంటూ సీఐ భాస్కర్ కు కంప్లైంట్ ఇచ్చాడు. మీరొక్కరే వస్తే సరిపోదని.. అందరూ వచ్చి నా సమస్య పరిష్కరించాలని కోరాడు.
కార్తికేయ ధైర్యాన్ని చూసిన సీఐ భాస్కర్.. కాసేపు అతడితోనే ముచ్చటించారు. సమస్య వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి స్వీట్లు తినిపించారు. రౌడీలను ఏం చేయాలని సీఐ అడగ్గా.. లాఠీతో కొట్టాలని చెప్పాడు. అలాగే దొంగలను ఏం చేయాలని అడగ్గా.. కాల్చివేయాలంటూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకున్న పోలీసులు అతడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఏ చిన్న సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయాలంటూ ఫోన్ నెంబర్ రాసిచ్చారు. చిన్నారి ధైర్యం చూసి తమకు ముచ్చటేసింది.. ప్రజలు ఎలాంటి సమస్యల నిమిత్తం వచ్చినా చట్టప్రకారం వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సీఐ భాస్కర్ తెలిపారు.
ఇదిలా ఉంటే గత ఏడాది కర్నూలు జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో స్కూల్ విద్యార్థి సందడి చేసిన సంగతి తెలిసిందే. తన పెన్సిల్ పోయిందంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన హనుమంతు అనే విద్యార్థి.. తన ఫ్రెండ్ అయిన హనుమంతు మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయంలో రాజీ చేసుకోవాలని పోలీసులు సరదాగా సూచించినా తగ్గేదేలేదంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. చివరకు పోలీసులు కంప్లైట్ రిజిస్టర్ చేసుకుంటామని చెప్పడంతో శాంతించాడు. అప్పట్లో హనుమంతు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు కార్తికేయ వీడియో కూడా వైరల్ గా మారుతోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.