నెల రోజుల వ్యవధిలో రైతన్న ఆశ నిరాశగ. మారింది. ఒక క్వింటా పసుపు 2 వేలకు పైగా ధర తగ్గి రైతుల కన్నీటిని మిల్గిల్చేలా చేసింది. గత నెలలో క్వింటాకు రూ. 8300ల ధర పలుకగా ప్రస్థుస్తాం 5 నుంచి 6వేల రూపాయలు పలకడం కష్టంగా మారుతోంది. చిన్న గాయం తగిలిన పసుపును పూసి బ్యాక్టీరియా నుంచి రక్షణ పొందుతాం.. ప్రతి వంటలో పసుపు లేకుంటే అసలు రుచే రాదు. కానీ పసుపును పండించే రైతులకు మాత్రం పసుపు గిట్టుబాటు ధర లేకుండా మనసుకు గాయంగా మారుతున్నాయి. వంటలో రుచేమో గానీ., ఆరుగాలం కస్టపడి పండించిన పంటకు సరైన ధర లేకుండా చేదును చవిచూసేలా చేస్తున్నాయి. పసుపు ధర ఈ యేడాది మొదవలవ్వడం నుంచి హోరెత్తి రైతు కళ్ళలో ఆనందాన్ని నింపగా... జూన్ నెల వచ్చేసరికి ఉసూరుమనిపిస్తున్నాయి. సరిగ్గా రెండు నెలల క్రితం ఓ స్థాయికి చేరి 10 వేల వరకు ధర పెరుగుతుందనుకుంటున్న తరుణంలో పతనమవ్వడం కడప జిల్లా పసుపు రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
గడచిన రెండేళ్లుగా ధరల్లేక దిగాలు చెందుతున్న రైతును ఈ యేడాది అదుకుంటుందనుకుంటే ఈ యేడాది నిరాశపరించింది. తగ్గిన ధర అటుంచితే కోనుగోళ్లు లేక పసుపును రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లోనే రైతులు పడిగాపులు గాయాల్సి వస్తోంది. ఈ పరిస్ధితుల్లో కడప జిల్లా పసుపు తమ సమస్యలు పరిషఅకరించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
కడప జిల్లా పసుపు రైతాంగానికి ఈ ఏడాది గిట్టుబాటు ధర కష్టాలు కన్నీటికి కారణం అవుతున్నాయి. సరిగ్గా రెండు నెలల కిందట ధర అమాంతం పెరిగి... ఇప్పుడు పతనమైందిన ధరల కారణంగా పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా మూడేళ్ల తరువాత ధర రావడంతో గిట్టుబాటు ధర వస్తుందని ఆశించారు. తీరా మార్కెట్ కు తీసుకెళ్లే సమాయానికి ధరలు ఒక్కసారిగా పతనమైయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ధరలు పడిపోయి రైతులు ఆందోళన చెందుతుంటే.. మరో వైపు కొనుగోలు దారులు కూడా ముందుకు రావడం లేదు.
గత రెండు మూడు ఏళ్ళు తీవ్ర నష్టాన్ని చవిచూసిన రైతన్నలు అవన్నీ దిగమింగుకుంటూ ఈ ఏడాది పసుపును రైతులు సాగు చేశారు. తీరా పంట సాగుచేసి లక్షలు ఖర్చుపెట్టి పసుపు దిగుబడులు మార్కెట్కు తీసుకెళ్తున్న సమయంలో ధరలు పతనమవుతున్నాయి. గత మార్చి నెలలో క్వింటా ధర 8,300కు పైనే పలకగా.. అనంతరం 10 వేల వరకు ధర పలుకుంతున్న సంకేతాలు మార్కెట్ వర్గాల నుంచి వచ్చాయి. అయితే ధర అక్కడి నుంచి ఎమైందో కానీ ధర పెరగకపోగా నెలన్నర రోజుల్లోనే 2 వేలకు పైగా ధర తగ్గింది. మరోవైపు గతేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడి తగ్గడం.. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సీఎం జగన్ సొంత జిల్లాలో రైతుల ఆవేదన ఆకాశానికి అంటుతోంది. కడప జిల్లాలో 15వేల హెక్టార్లల్లో పసుపు సాగుచేశారు. మైదుకూరు, ప్రొద్దుటూరు, ఖాజీపేట, దువ్వూరు, ఒంటిమిట్ట, రాజంపేట, రాజుపాలెం మండలాల్లో అత్యధికంగా సాగుచేశారు. కర్నూలు జిల్లాలోనూ చాగలమర్రి, మహానంది, ఆళ్లగడ్డ, పాణ్యం మండలాల్లో పసుపు సాగుచేస్తున్నారు. ఎకరాకు 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి రైతులు పసుపు సాగు చేశారు. సాధారణంగా ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. కానీ గతేడాది వర్షాల వల్ల పంట బాగా దెబ్బతింది. ఎకరాకు 10-15 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు.
రాయలసీమలో పసుపు విక్రయ మార్కెట్ ఉన్నది కడపలోనే కావడంతో రోజుకు 1500 నుంచి 2000 బస్తాల సరుకు మార్కెట్కు వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో పసుపు ధర క్వింటా కనిష్ఠంగా 3199, గరిష్ఠంగా 6740 పలుకుతోంది. ఎక్కువగా ధర రూ.5500 నుంచి రూ.6500కు మించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పెరుగుతుందనుకున్న ధర తగ్గడంతో అన్నదాతలు ఆందోళన రెట్టింపు అవుతొంది. అధిక వర్షాలకు పంట దెబ్బతిని, సగానికి పైగా దిగుబడి తగ్గడం.. దీనికి తోడు ధరలు కూడా పతనం కావడంతో అప్పులపాలు కావాల్సి వస్తోందని వాపోతున్నారు.
ధర లేక, పంట కోనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రోజుల తరబడి రైతులు కడప మార్కెట్ యార్డులోనే ఉంటున్నారు. ఓ వైపు కరోనా కేసులు పెరుగతుండటంతో భయాందోళన మధ్య పంట అమ్ముకునేందుకు అలానే మార్కెట్ యార్డులోనే ఉంటున్నారు. దీంతో పసుపు రైతులను అదుకునేందుకు తక్షణం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం పసుపు మద్దతు ధరను రూ.6,850గా నిర్ణయించి, రైతుల నుంచి కొనుగోలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 50వేల టన్నులు సేకరిస్తే, ఒక్క కడప జిల్లాలో 16,500 టన్నులు ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. ప్రభుత్వం కనీస మద్దతు ధరను రూ.8,500కు పైగా నిర్ణయించి కొనుగోలు చేయాలని లేదంటే అప్పులపాలవుతామని రైతులు అంటున్నారు. ప్రస్తుత కరోనా కష్టాలకు తోడు ఈ పంట నష్టం కష్టాలు ఎదురైతే రైతులు కోలుకోలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ప్రభుత్వం పసుపు రైతుల కష్టాలపై స్పందించాలని వేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.