GT Hemanth Kumar, News18, Tirupati
దేశంలోనే కాదు ప్రపంచంలోనే అన్ని హిందూ దేవాలయాలకు తిరుమల శ్రీవారి ఆలయమే (Tirumala Temple) రోల్ మోడల్. క్యూలైన్ నిర్వహణ, లక్ష మంది భక్తులకు ఒకేసారి శ్రీవారి దర్శనభాగ్యం (Tirumala Darshan) కల్పించే విధంగా టీటీడీ ఎంతో పటిష్టంగా ఉంది. ఇక ప్రత్యేక సెక్యూరిట విభాగం, సీసీకెమెరాల నిర్వహణ టీటీడీకే సొంతం. అన్నప్రాసాధం వితరణ నుంచి క్యూలైన్ మేనేజ్మెంట్ వరకు శ్రీవారి ఆలయాన్ని ఆదర్శంగా తీసుకోని ఆలయ నిర్వహణ చేస్తున్నారు. కొందరు ఆలయ అధికారులు తిరుమల ఆలయానికి వచ్చి ట్రైనింగ్ కూడా పొందుతుంటారు. జూనియర్ ఐఏఎస్ లు సైతం టీటీడీ (TTD) లో మూడు రోజులపాటు ట్రైనింగ్ పొందుతారు. ఇలా ఎంతో ప్రత్యేకమైన ఆలయం కబ్బాట్టే పర్యావరణ పరిరక్షనలో తనదైన మార్క్ వేస్తోంది.
స్వల్ప వ్యవధిలోనే ప్లాస్టిక్ రహిత తిరుమలగా తీర్చి దిద్దిన టీటీడీ అధికారులు... ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే బ్యాటరీ కార్లను వినియోగిస్తున్న టీటీడీ... సోలార్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్న టీటీడీ.. గ్రీన్ ఎనర్జీలో సైతం ఆదర్శంగా నిలిచి అన్ని దేవాలయాలకు ఆదర్శంగా నిలవాలని కేంద్ర ప్రభుత్వం సైతం సహకారం అందించే దిశగా అడుగులు వేస్తోంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో టీటీడీ చేపట్టిన గ్రీన్ పవర్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. ఇటీవల బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియఎన్సీ డైరెక్టర్ జనరల్ శ్రీ అభయ్ బాక్రే టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డితో సమావేశమయ్యారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న గ్యాస్ ఆధారిత ఆవిరికి బదులుగా సోలార్ ఆధారిత ఆవిరిని ఉపయోగించేందుకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి టీటీడీ అధికారులు వివరించారు. అంతేకాదు పవిత్ర లడ్డూ మహా ప్రసాదం తయారు చేయటానికి క్లీన్ కుకింగ్ విధానాన్ని అందించనుంది. తద్వారా కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గించవచ్చు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని బీఈఈ అందిస్తుంది. దీని ద్వారా టీడీపీలో విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు ఛార్జీల భారం కూడా తగ్గనుంది.
ప్రత్యామ్నాయ విద్యుత్ కు సంబంధించి తిరుమల ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి గల అన్ని అవకాశాలు పరిశీలించడానికి ఒక బృందాన్ని పంపుతామన్నారు. టీటీడీ అధికారులు ఈ బృందంతో కలసి ప్రతిపాదనలు పంపితే ఇందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తామని వారు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirumala Temple, Tirumala tirupati devasthanam