TIRUPATI TTD MADE ANNOUNCEMENT THA ARJITHA SEVA TOKENS WILL BE RELEASED ON MARCH 20TH FROM APRIL 1ST FULL DETAILS HERE PRN TPT
TTD News: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈనెల 20 నుంచి ఆర్జిత సేవా టికెట్ల జారీ.. ఇలా బుక్ చేసుకోండి..
తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)
కలియుగ ప్రత్యక్ష దైవలం తిరుమల శ్రీవారిని (Tirumala Sivaru) ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు భావిస్తుంటారు. అలాంటిది శ్రీవారి సేవల్లో పాల్గొనే భాగ్యం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
కలియుగ ప్రత్యక్ష దైవలం తిరుమల శ్రీవారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు భావిస్తుంటారు. అలాంటిది శ్రీవారి సేవల్లో పాల్గొనే భాగ్యం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అందుకో టీటీడీ స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాత సేవ, తోమాల సేవ వంటి ప్రత్యేక పూజల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది. ఐతే కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ సేవల్లో పాల్గొనే భాగ్యం భక్తులకు దూరమైంది. ఇప్పుడు కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు భక్తులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు.
ఈ సేవలను బుక్ చేసుకునేందుకు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న సంఖ్యను బట్టి ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో భక్తులకు టికెట్లను కేటాయించనున్నారు. టికెట్లు పొందినవారి జాబితాను మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల తరువాత వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఈ సమాచారాన్ని భక్తులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తామని టీటీడీ పేర్కొంది. టికెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన భక్తులు నేరుగానే బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
పర్వదినాల్లో పలు ఆర్జిత సేవలు రద్దు
ఇక పర్వదినాల సందర్భంగా ఆర్జిత సేవలనురద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఏప్రిల్ 2న ఉగాది సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి సందర్భంగా తోమాల, అర్చన, సహస్రదీపాలంకార సేవ, వసంతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా, శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 10 నుండి 12వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు, జూన్ 14న జ్యేష్టాభిషేకం మూడో రోజున అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దయినట్లు టీటీడీ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.