GT Hemanth Kumar, Tirupathi, News18
తిరుమల పుణ్యక్షేత్రం మరో ఉత్సవానికి సిద్ధమైంది. సూర్యజయంతి నాడు గడప దాటని గోవిందుడు... తెప్పోత్సవాలతో కనువిందు చేయనున్నాడు. తిరుమల (Tirumala) శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు రంగరంగ వైభవంగా సాగనున్నాయి. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం ఏకాదశి నుండి ఐదు రోజుల పాటు నిర్వహించే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు టీటీడీ (TTD) అధికారులు. తెప్పోత్సవాలను పురస్కరించుకున్ని శ్రీవారి పుష్కరిణిని కూడా సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెపోత్సవాల నేఫద్యంలో ఐదు రోజులపాటు పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. కలియుగ వైకుంఠంలో కొలువైన శ్రీవేంకటేశ్వరునికి నిత్య, వార, పక్ష, మాస, నక్షత్ర, సాలకట్ల ఉత్సవాలు నిర్వహిస్తారు ఆగమ పండితులు. అందుకే నిత్య కళ్యాణం.... పచ్చతోరణంగా భాసిల్లుతోంది తిరుమల పుణ్యక్షేత్రం.
శ్రీనివాసుడు అలంకార ప్రియుడు., ఉత్సవ ప్రియుడు కాబట్టే... ప్రతి నిత్యం ఏదొక ఉత్సవం ఆలయంలో జరుగుతూనే ఉంటుంది. వేసవి కాలం ప్రారంభంలో ప్రతి ఏటా స్వామి వారికి తెపోత్సవాలను ఆగమ శాస్త్రం ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో వున్న పుష్కరిణిలో శ్రీవారి తెపోత్సవాలు జరుగుతాయి. 15వ శతాబ్దంలో సాళువ నరసింహరాయులు స్వామి వారి పుష్కరణిలో నిరాళి మండపాన్ని నిర్మించాడు. తెప్పోత్సవాల్లో మలయప్ప స్వామి ఐదు రోజుల పాటు ఈ నిరాళి మండపం చుట్టు ప్రదక్షణలుగా తెప్పలో విహరిస్తారు.
ఫాల్గుణ మాసం ఏకాదశినాడు ప్రారంభమై పౌర్ణమి రోజున ముగిసేలా ఐదు రోజుల పాటు జరిగే తెపోత్సవాలలో మొదటి రోజు శ్రీ వేంకటేశ్వరుడు త్రేతాయుగానికి ప్రతీకగా శ్రీరాముని అవతారంలో మాడ వీధులలో ఊరేగి పుష్కరిణికి చేరుకున్ని తెప్పలపై మూడు ప్రదక్షణలుగా విహరిస్తారు. రెండోవ రోజు ద్వాపర యుగానికి ప్రతీకగా శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పలపై విహరిస్తారు. మూడవ రోజు కలియుగానికి ప్రతీకగా భూదేవి,శ్రీదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి తెప్పల పై విహరిస్తారు. ఇక నాలుగవ రోజు మలయప్పస్వామి ఐదు ప్రదక్షణలతో తెప్పలపై విహరిస్తారు. చివరిగా ఐదవరోజు స్వామి వారు ఏడు ప్రదక్షణలతో తెప్పలపై విహారిస్తూ పుష్కరణిలో ఉన్న ఆశేష భక్తజనాని కనువిందు చేస్తారు.
శ్రీవారి వార్షిక తెపోత్సవాలను పురస్కరించుకున్ని టీటీడి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. శ్రీవారి పుష్కరిణిలో టీటీడి ఇంజనీరింగ్ అధికారులు తెప్పల ట్రైల్ రన్ ను నిర్వహించి లోటు పాట్లును పరిశీలించారు. ట్రైల్ రన్ విజయవంతం కావడంతో అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సారి తెప్పలపై ఉన్న మండపాని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. తెప్పోత్సవాలు జరిగే ఐదు రోజుల పాటు టీటీడి ఉద్యానవన విభాగం అధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో తెప్పను సుందరంగా అలంకరించనున్నారు.
కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం టీటీడీ శ్రీవారి పుష్కరిణిని మూసివేసిన టీటీడీ.. గత ఏడాది తెప్పోత్సవాలను ఏకాంతంగా నిర్వహించింది. ఈసారి కరోనా తగ్గుముఖం పట్టడంతో తెప్పోత్సవాలకు భక్తులను అనుమతిస్తున్నారు.
తెప్పోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారికి జరిగే నిత్య సేవైన సహస్రదీపాలంకరణ సేవలను ఐదు రోజుల పాటు రద్దుచేశారు. తెప్పోత్సవాల కారణంగా వర్చువల్ అర్జితసేవలైన సహస్రదీపాలంకార సేవను మార్చి 13, 14వ తేదీల్లో మార్చి 15, 16, 17వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirumala tirupati devasthanam, Ttd news