ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల వివాదం (Movie Tickets controversy) కొనసాగుతూనే ఉంది. నిబంధనలు పాటించని థియేటర్లను అధికారులు సీజ్ చేయడం.. లైసెన్స్ లేనివారి, ధరల తగ్గింపుతో నష్టపోతామనుకున్నవారు కొందరు స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేశారు. ఐతే రూల్స్ బ్రేక్ చేయడం వల్ల సీజ్ చేసిన థియేటర్లను జరిమానా చెల్లించి ప్రారంభించుకోవచ్చని.. నెలరోజుల్లోగా పూర్తి అనుమతులు తెచ్చుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించిన సంగతి తెలసిందే. మంత్రి ప్రకటనను థియేటర్ల యాజమాన్యాలు స్వాగతించాయి. థియేటర్లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ప్రముఖ సినీ నిర్మాత, ఎపీ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు ఎన్.వి.ప్రసాద్. పని ఒత్తిడిలో ఉన్న జేసీలను కలిసి విన్నవించుకుంటే ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు.
సీజ్ చేసిన థియేటర్లకు నెల సమయమివ్వడం సంతోషమేనని.. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న థియేటర్ల పరిస్థితి మరింత ఘోరంగా తయారైందని ఎన్వీ ప్రసాద్ అన్నారు. కరోనాతో రెండేళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.., ఓటీటీ కారణంగా సినీపరిశ్రమ నష్టాలకు మరో కారణమని అభిప్రాయపడ్డారు. కమిటీ కాలయాపన చేయకుండా మా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎవరు పడితే వారు సినీపరిశ్రమ గురించి మాట్లాడవద్దన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నారని.. హీరోలు మా సమస్యలపై స్పందించడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు.
ఇక నిర్మాత నట్టి కుమార్ పై ఎన్వీ ప్రసాద్ మండిపడ్డారు. ఆయన తెలంగాణాలో ప్రత్యేక ఛాంబర్ పెట్టుకోవాలని హితవు పలికారు. మాతో సంబంధం లేకుంటే ఎన్నికలు మీరే నిర్వహించుకోవాలని సూచించారు. ఇక థియేటర్లలో టిక్కెట్ల రేట్లపై మరోసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎన్వీ ప్రసాద్ కోరారు. కరోనా సమయంలో మూడు నెలల విద్యుత్ ఛార్జీలు మాఫీ అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. వీలైంత త్వరగా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి.., థియేటర్ యాజమాన్యాలతో కలిసి గురువారం ఉదయం కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మంత్రి పేర్ని నానితో భేటీ అయి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా సినిమా థియేటర్లు సీజ్ చేయడం వల్ల కార్మికులు, నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి పేర్ని నాని సీజ్ చేసిన థియేటర్లు జరిమానా చెల్లించి సినిమాలు ఆడించుకోవచ్చారు. నెలరోజుల్లోగా లైసెన్స్ రెన్యువల్ చేసుకునేలా జిల్లా జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అధికారులు గుర్తించిన లోపాలను నెలరోజుల్లోగా సరిచేసుకోవాలని మంత్రి నాని స్పష్టం చేశారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Theatres, Tollywood