Nara Lokesh Padayatra: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కనిపిస్తోంది. అన్ని పార్టీలు జనం బాట పట్టాయి. ఇందులో
భాగంగా నారా లోకేష్ మరో అడుగు ముందుకు వేస్తూ.. యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర రేపటి నుంచి
ప్రారంభం కానుంది. ఉదయం 11.03 గంటలకు పాదయాత్ర తొలి అడుగు పడుతుంది. అయితే తొలి రోజు 8.5 కిలో మీటర్ల మేర లోకేష్
పాదయాత్ర సాగుతుంది. ఈ పాదయాత్ర సందర్భంగా గురువారం లోకేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తరువాత చిత్తూరు జిల్లా
కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ టీడీపీ కార్యకర్తలు లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు
ఇచ్చారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లోనే లోకేష్ బస చేశారు. ఇక శుక్రవారం ఉదయం 10.15 గంటలకు కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్
నుంచి లోకేష్ బయలుదేరి స్థానిక వరదరాజుల స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అక్కడ ప్రత్యేక పూజల తరువాత 4వేల కిలో మీటర్ల యువగళం పాదయాత్రలో భాగంగా ఉదయం 11.03 గంటలకు తొలి అడుగు వేస్తారు.
అనంతరం కుప్పంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే యువగళం సభలో పాల్గొని లోకేష్ ప్రసంగిస్తారు. సభ తరువాత కుప్పం ప్రభుత్వ
ఆసుపత్రి, శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ రోడ్డు మీదుగా రాత్రి బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు.
యువగళం పేరుతో చేపట్టే పాదయాత్రలో భాగంగా తొలిరోజు 8.5 కిలో మీటర్లు లోకేష్ నడుస్తారు. తన పాదయాత్రలో అడుగడుగునా ప్రజలతో
మమేకం అవుతూ, కార్యకర్తలు, స్థానిక ప్రజలను పలుకరిస్తూ ముందుకు సాగుతారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజలతో
లోకేష్ మాట్లాడి, వారి సమస్యలపై వినతులు స్వీకరిస్తారు.
పాదయాత్రకు సిద్ధమైన ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోందని, వైసీపీ బాదుడే
బాదుడు పాలనలో బాధితులు కాని వారు లేరని అన్నారు. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను వైసీపీ నేతలు హరించారని, రాజ్యాంగాన్ని
తుంగలో తొక్కి రాక్షస పాలన సాగిస్తున్నారని, ఏపీలో ప్రశ్నించే ప్రతిపక్షంపై అక్రమ కేసులు, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి కొత్త
పరిశ్రమలు రావడంలేదని.. ఉన్నవాటిని తరిమేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుల, మత, ప్రాంతాల పేరుతో విద్వేషాలు
రెచ్చగొడుతున్నారని, పోలీస్ వ్యవస్థను జగన్‌రెడ్డి తన ఫ్యాక్షన్ రాజకీయాలకు వాడుతున్నారని విమర్శించారు. జగన్‌రెడ్డి తుగ్లక్
నిర్ణయాలతో అన్నివ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఏపీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఏపీని సంక్షోభంలోకి
నెట్టేస్తున్న జగన్ సర్కార్‌ను గద్దెదింపాల్సిందేనని లోకేష్ పిలుపిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu Naidu, Kuppam, Nara Lokesh, TDP