GT Hemanth Kumar, News18, Tirupati
మనిషి ఆరోగ్యాంగా ఉండాలి అంటే.. ఆరోగ్య కరమైన పౌష్ఠికాహారం ఎంతో అవసరం. పౌష్ఠిక ఆహారం అధికంగా కూరగాయలు., పండ్లు, ఆకుకూరల నుంచి లభిస్తుంది. మనం సాధారణంగా టమోటా, వంకాయ, ఇతర రకాల కాయగూరలు మహా అయితే రెండు లేదా మూడు రకాలు చూసి ఉంటాం. ఒక్కో కాయగూరలు అందులోనూ హైబ్రీడ్, నాటు అనే రకాలు అనుకున్న వాటిలో నాలుగు ఉంటుంది. కానీ చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి వద్ద ఒక్కో కూరగాయ నాటు రకాలు పదుల సంఖ్యలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. మీరు విన్నది నిజమే... ఆయన వద్ద దాదాపు కొన్ని వందల సంఖ్యలో నాటు విత్తనాలు దొరుకుతాయి. అరుదైన విత్తనాల నుంచి మదనపల్లె నాటు రకం టమోటా వరకు ఈయనదగ్గర దొరుకుతాయి. ఆయనకు విత్తనాలపై ఆలోచన ఎందుకు వచ్చింది. వ్యవసాయం వైపు ఎలా అడుగులు వేశారు. ఆయన వద్ద ఉన్న విత్తనాలేంటి..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి జిల్లా (Tirupati District) చంద్రగిరి నియోజకవర్గంలోని మారుమూల పల్లె ఎం.కొంగవారి పల్లె గ్రామం. ఆ పల్లెలోకి వెళితే.. గ్రామంలో చివరి ఇల్లు విచిత్రంగా కనిపిస్తుంది. ఇంటి చుట్టూ ఆరోగ్య కరంగా పెరిగిన మొక్కలు, ఆకుకూరలు, ఏపుగా ఎదిగిన కాయగూరలు కనిపిస్తాయి. ఇంటి చుట్టుపక్కలే కాదు ఇంటి పై కప్పుపై ఏపుగా ఎదిగా చెట్లు.. గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న కాయగూరలు కనిపిస్తుంటాయి. ఆ ఇల్లే నాటు విత్తనాల నాయుడు @అలియాస్ ధనుంజయ నాయుడు నివాసం.
రైతు కుటుంబంలో జన్మించిన ధనుంజయ నాయుడు బిఎ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి కాగానే చిత్తూరు జిల్లాలో అమర్ రాజా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. రైతు కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి మొక్కలపై మమకారం ఎక్కువ. మొక్కలంటే ఎక్కువగా ఇష్టపడే గుణం ఉన్న ధనుంజయ.. పెరటిలో ఇంటిపై వివిధ రకాల మొక్కలు నాటేవారు. ఇలా ఆయన అలవాటే వృత్తిగా మార్చుకోవాలని ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఇక రసాయనాలు లేని ఆరోగ్య కరమైన పదార్థాలు పండించాలని సంకల్పించారు. అనుకున్న విధంగా స్వదేశీ విత్తనాలు రైతులకు అందిచాలని మహా యజ్ఞానికి పూనుకున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రకాల వ్యవసాయ ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. అలా జరిగే ప్రదర్శనలో నాయుడు ఉత్సాహంగా పాల్గొంటూ అక్కడ రైతులు చెప్పే అనుభవాలు శ్రద్దగా విని.. వాటిని ఒక్కో పాఠంగా భావించి వ్యవసాయంపై పట్టుసాధించారు. నేర్చుకున్న మెళకువలను ప్రయోగాలు చేసేవారు నాయుడు. ఇలా ఆయన కృషి.. ఎనలేని నాటు విత్తనాల బండాగారంగా మారింది.
దేశంలో ఎక్కడ విత్తనాల స్టాల్ల్స్., ప్రదర్శనలు జరిగితే అక్కడ ధనుంజయ నాయుడు స్టాల్ ఫేమస్. విత్తనాలు సేకరించడం మాత్రమే కాదు... వాటికీ అనువైన వాతావరణం సృష్టించడంలోనూ ధనుంజయ నాయుడు ప్రత్యేక ద్రుష్టి పెడుతారు. రైతులకి అందించడమే కాదు వాటిని ఎలా కాపాడాలో నాయుడు వాళ్ళకి సూచిస్తారు.
ధనుంజయ నాయుడు వద్ద వెయ్యికిపైగా విత్తనాలు ఉన్నాయి. అందులో అన్ని నాటు విత్తనాలు ఉండటం విశేషం అయితే... ఆరోగ్యకరమైన సేంద్రియ విత్తనాలు ఉండటం ప్రత్యేకం. మనకు తెలిసి టమోటా మూడు లేదా ములుగు రకాలు తెలుసు... కానీ నాటు విత్తనాల నాయుడు దగ్గర ఏకంగా 60 రకాలకు పైగా టమోటా విత్తనాలు ఉన్నాయి. అందులో చెర్రీ రకాలే 12 ఉండగా... ఈయన తోటలో కాచే టమోటా అరచేయికి సమానంగా ఉంటుంది. గుత్తులు గుత్తులుగా, కోడి గుడ్లు ఆకారంలో, నేరేడు పండ్ల సైజులో టమోటాలు ఉన్నాయి. పర్పుల్, నీలం, ఎరుపు, పసుపు., ఆరంజ్ రంగుల టమోటాలు పండిస్తాడు. వీటిని అరకు, నాగపూర్, కోరాపుట్, ఛత్తీస్గఢ్, మైసూరు, కోయంబత్తూర్ ప్రాంతాల్లో సేకరించాడట. ఇక నీలం., ఎరుపు, నలుపు., గులాబీ., పచ్చ తెలుపు వర్ణాలతో కూడిన ముల్లంగి నాటు విత్తనాల నాయుడు పండిస్తున్నాడు. ఇందులోనే 5 అంగుళాల పొడవు నుంచి 12 అంగుళాల పొడవు పెరిగే రకాలు ఉన్నాయి.
రక్త హీనత తగ్గించుకునేందుకు వాడే క్యారెట్ మహా అయితే మూడు రకాలు చూసుంటాం. కానీ విత్తనాల నాయుడు వద్ద 13 రకాల క్యారెట్ రకాలు సేకరించి విత్తనాలను అభివృద్ధి చేశారు. వ్యవసాయానికి సాగు భూమి ఎంతో అవసరం. తన ఇంటిని ఆనుకుని ఉండే 40 సెంట్ల భూమిని అద్దెకు తీసుకుని అందులో ఎర్ర అవిసె చెట్ల పెంచారు. తెల్ల పూలు పూసే అవిసె ఆకు కన్నా ఇది రుచి ఎక్కువ. వాసన ఉండదు.
ఈ మొక్కలను సహజ షెల్టర్‌లా వాడుకుని వాటి నీడలో కేరట్, ముల్లంగి వంటివి పండిస్తున్నారు. నాయుడు పొలంలో చూసే దాకా సొరకాయల్లో ఇన్ని రకాలుంటాయని మనం ఊహించలేం కూడా. 3 అంగుళాల నుంచి 4 అడుగుల దాకా ఉండే సొరకాయల్ని ఈయన పండిస్తున్నారు. ఒక్కో సొరకాయ 15 కిలోల బరువుండే రకాలు కూడా ఈయన దగ్గరున్నాయి. బెంగాలీలకు, తెలుగు ప్రజలకు ఇష్టమైన వంకాయల్లో 100 రకాలు నాయుడు సేకరించారు. ముళ్ల వంకాయలు కలుపుగా పెరుగుంటాయి. అలంటి కలుపు మూళ్ళ వంకాయల విత్తనాలు ఈయనవద్ద 15 రకాలున్నాయి. గోలీగుండ్ల సైజు నుంచి ఎనిమిది అంగుళాల పొడవు దాకా పెరిగే వంకాయలున్నాయి.
మైసూరు, కోయంబత్తూరు, ఛత్తీ్‌సగఢ్, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి 70 రకాల దేశవాళీ మిరప విత్తనాలు సేకరించి, పండించి, తిరిగి విత్తనాలు ఉత్పత్తి చేశారు. నాయుడు వ్యవసాయ క్షేత్రంలో చిక్కుడు పందిళ్ళు కనువిందుగా ఉన్నాయి. 18 రకాల పందిరి చిక్కుళ్లున్నాయి. ఎరుపు, తెలుపు, నీలం, పచ్చ రంగుల్లో గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. ఇవి కూడా ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోనే సేకరించామని చెబుతున్నారు. ఇంకా ఆకాకర సహా 5 రకాల కాకర తీగలున్నాయి. 7 రకాల బీరకాయలు పండిస్తున్నారు.
13 రకాల కీరదోసకాయల విత్తనాలు సేకరించారు. ఎరుపు, పసుపు, పచ్చ, వంగపూత రంగుల్లో వుండే 30 రకాల బీన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎలాంటి ఎరువులు, రసాయనాలు లేకుండా పండే 47 రకాల ఆకుకూర విత్తనాలు కూడా ఈయన సేకరించారు. అడవుల్లో మాత్రమే దొరికే పూరేడు గుడ్లాకు, అడవి నిమ్మ తులసి, అడవి చేమాకు, కుందేటి చెవులాకు, దేవదారాకు వంటివి కూడా సేకరించి తిరిగి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అడవి కందగడ్డ, నిమ్మటాయగడ్డ వంటివి కూడా ఆయన సేకరణ జాబితాలో ఉన్నాయి. ఇలా ధనుంజయ నాయుడు కాస్త... నాటు విత్తనాల నాయుడుగా చిత్తూరు జిల్లాలో పేరు తెచ్చుకున్నాడు.
ఎర్ర బెండ దక్షిణాది రాష్ట్రాల్లో విరివిగా కనిపించేది. కాలక్రమేణా ఎర్ర బెండకాయలు అంతరించి పోయాయి. ఆ ఎర్ర బెండ విత్తనాలు సేకరించి తిరిగి ఉత్పత్తి చేసాడు. ఇందులో ఎక్కువ జిగురు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు అంటారు వైద్యులు. మూడు అంగుళాల నుంచి ఒక అడుగు పొడవు దాకా పెరిగే రకాలు ఉన్నాయి. బెండలోనే 23 దేశవాళీ రకాలను నాయుడు సేకరించి పండిస్తున్నారు. కొమ్ముల్లా ఉండే బెండ, స్టార్ ఆకారంలో ఉండే బెండ, నూగు లేని బెండ రకాలు ఈయన క్షేత్రానికి సొంతం.
నాటు విత్తనాలు ఉపయోగించడం ద్వారా వీటిల్లో పోషక విలువలతో పాటుగా రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. నాటు రకాల పంటకాలం కాస్త ఎక్కువే అయినా కాపు కాలం కూడా ఎక్కువే. కాస్త ముదిరినవి కూడా వంటకి పనికివస్తాయి. పురుగు మందులు, ఎరువుల ఖర్చు ఉండదు. వాటివల్ల వచ్చే రోగాల ప్రమాదమూ ఉండదు. పైగా మిద్దెతోటల్లోనూ, పెరటితోటల్లోనూ వీటి పెంపకం చాలా సులువు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirupati, Vegetables