Good News: కరోనా కష్ట కాలంలో టీటీడీ పెద్ద మనసు.. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన పాలకమండలి

ప్రతీకాత్మక చిత్రం

అసలే కరోనా కష్ట కాలం.. రోజు రోజుకూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం పడిపోతోంది. రోజుకు 25 లక్షల రూపాయల ఆదాయం కూడా రావడం లేదు. అయినా ఇలాంటి కష్ట సమయంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కష్టాలను చూసి కరిగి.. భారీగా కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది.

 • Share this:
  ఏపీని కరోనా వైరస్ వెంటాడుతోంది. రోజు రోజుకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి రోజూ 20 వేలకు తగ్గకుండా కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా 24 గంటల్లో 100కు తగ్గడం లేదు. ప్రభుత్వం ఎన్ని కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నా వైరస్ కు బ్రేకులు పడడం లేదు. ఆస్పత్రుల సంఖ్య.. బెడ్ ల సంఖ్య, ఆక్సిజన్ సరఫరా సంఖ్య పెంచినా సరిపోవడం లేదు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఈ కరోనా సామాన్య ప్రజల మీదే కాదు.. సెలబ్రెటీలు.. రాజకీయ నేతలపైనా పడింది. ఆఖరికి మంత్రులను కూడా వదల్లేదు. అక్కడితో ఆగని కరోనా ప్రముఖ పుణ్య క్షేత్రాలపైనా పడింది. దాదాపు చాలా పుణ్యక్షేత్రాల్లో ఏకంత సేవలే నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల భక్తులను అనుమతించినా.. పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. అదికూడా కరోనా నిబంధనలు కఠినంగా పాటిస్తున్నారు. అయినా కరోనా మాత్రం కట్టడి కావడం లేదు..

  ముఖ్యంగా కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానంపైనే కరోనా ప్రభావం భారీగానే పడింది. దీంతో చాలా వరకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది టీటీడీ. సర్వదర్శనాల టోకెన్లను నిలిపివేసింది. కేవలం ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి.. అది పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది. దీంతో తిరుమలలో ఆదాయం పూర్తిగా పడిపోయింది. తాజాగా బుధవారం విషయాన్ని చూసుకుంటే భక్తుల సంఖ్య రెండు వేలకే పరిమితమైంది. కేవలం 17 లక్షల ఆదాయం మాత్రమే వచ్చింది. అయినా ఇలాంటి కష్ట సమయంలో తిరుమలి తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.

  కరోనా కష్ట కాలంలో.. ఏపీ ప్రజలను ఆదుకోవాలని టీటీడీ నిర్ణయించింది. వివిధ ప్రాంతాల్లో 22 జర్మన్ షెడ్లు నిర్మించి కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాడానికి సిద్ధమైంది. కరోనా కాలంలో.. అదీ ఆదాయం తక్కువ వస్తున్న సమయంలో 3.52 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. కోవిడ్ చికిత్స కోసం బెడ్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు. విశాఖపట్నంలో 4, ప్రకాశంలో 2, అనంతపురంలో 3, కృష్ణలో 3, కర్నూలులో 2, గుంటూరులో 3, కాకినాడలో 3తో పాటుగా.. మరో రెండు చోట్ల జర్మన్ షెడ్ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఒక్కో జర్మన్ షెడ్లలో 30 ఆక్సిజన్ బెడ్లు ఉండేలా ఏర్పాటు చేయనుంది. ఆ బెడ్లకు సంబంధించిన నిధులను ఆయా జిల్లా కలెక్టర్ లకు కేటాయించనుంది టీటీడీ.

  రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ 19 బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో బెడ్ల అందుబాటు ఇబ్బందిగా మారింది. ఇటీవల రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగడంతో 11 మంది మరణించారని ప్రభుత్వమే నిర్ధారించింది. ఇలాంటి కష్ట సమయంలో తమవంతు సాయం చేయాలని టీటీడీ భావిస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు కొంత మేరకైనా తగ్గించాలనే సదుద్దేశంతో ఇటీవల తిరుపతిలోని శ్రీ పద్మావతి కోవిడ్ ఆసుపత్రి దగ్గర జర్మన్ షెడ్ నిర్మించారు. అందులో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ షెడ్లు నిర్మించాలని టీటీడీకి విన్నపాలు వచ్చాయి. దీంతో ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలతో శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయో నిధి నుంచి 3.52 కోట్లు మంజూరు చేశారు.
  Published by:Nagesh Paina
  First published: