TIRUPATI TIRUMALA TIRUPATI DEVASTHANAM NEWS THIS AUGST 7TH KALYANAMASTHU FUNDS FOR POOR PEOPLE NGS TPT
Tirumala Tirupati: పేదలకు వరంలా మారిన కళ్యాణమస్తు.. ఆగష్టు 7న జిల్లా కేంద్రాల్లో ఘనంగా వివాహాలు
ఆగస్టు ఏడున సామూహిక వివాహాలు
Tirumala Tirupati: కలియుగ దైవం.. ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడు సన్నిధిలో కాసేపు కూర్చోవాలి అంటే... ఎంతో అదృష్టం ఉండాలి అంటారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఏకం పేదల కోసం కళ్యాణమస్తు పేరుతో అద్భుత కానక అందిస్తోంది. ఆగస్టు ఏడున ఏపీ వ్యాప్తంగా సామూహిక వివాహాలకు రంగం సిద్ధమైంది.
Tirumala Tirupati Devasthanam: కలియుగ దైవం.. శ్రీవారి అనుగ్రహంతో.. వివాహం చేసుకోవాలని అందరూ ఆశిస్తారు. శ్రీనివాసుడి సన్నిధిలో వివాహం (Marriage) చేసుకోవాలనుంటే ఎంతో అదృష్టం ఉండాలి అంటారు.. ఆ అదృష్టాన్నే తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam) పేదలకు అందిస్తోంది. గోవిందుడు అందరి వాడే అంటూ.. పేదలకు తన కటాక్షం అందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఈ నిర్ణయంతో కొన్ని వందల జంటలు కల్యాణ మస్తు కార్యక్రమం ద్వారా ఒక్కటి అవ్వనున్నాయి. కళ్యాణమస్తు (Kalyanamasthu) కార్యక్రమం పునః ప్రారంభానికి టీటీడీ (TTD) సిద్ధం అవుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సామూహిక వివాహాలను జరిపేందుకు ముహూర్తం ఖరారు చేసింది టీటీడీ.
ఆగష్టు 7న ఏపీలోని 26 జిల్లా కేంద్రాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆగష్టు 7న ఉదయం 08:07 గంటల నుంచి 08:17 గంటల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
తిరుపతిలోని శ్వేత భవనంలో కల్యాణమస్తు కేంద్రీకృత కార్యాలయాన్ని బుధవారం ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్యాణమస్తు దరఖాస్తు పత్రం, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవంలో ఒక్కటయ్యే వధూవరులకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పెండ్లి వస్త్రాలు అందజేస్తామన్నారు.
ఉచితంగా వివాహం జరిపించుకోవచ్చని సూచించారు. జూలై 1 నుంచి 20వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో, టీటీడీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక కో ఆర్డినేటర్‌ను నియమిస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
కల్యాణ మస్తు కార్యక్రమం నిజానికి ఇప్పుడు తీసుకొచ్చిన నిర్ణయంకాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో.. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ పాలకమండలి చైర్మన్ గా ఉన్న సమయంలో ఈకార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 2006లో ఈ పథకానికి రూపకల్పన చేసిన.... 2007 ఫిబ్రవరి 21వ తేదీ ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పట్లో ఒక్కో జంటకు 7 వేల రూపాయల వరకు ఖర్చు చేసేవారు. అప్పట్లో ప్రారంభించిన కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా 34,017 జంటలను ఒక్కటి చేసిన టిటిడి. దింతో ఖర్చు సుమారు 24 కోట్ల రూపాయలు అయ్యాయని అంచనా. బంగారపు తాళిబొట్టు, వెండి మట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్ళిసామాగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధు మిత్రులకు పెళ్ళి భోజనాలు ఉచితంగా టీటీడీ కల్పించేది. మళ్లీ కార్యక్రమం పున: ప్రారంభం కావడంతో పేదలకు ఇది వరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.