TIRUPATI TIRUMALA LORD BALAJI TEMPLE HUNDI INCOME HITS ALL TIME LOW DUE TO CORONA SECOND WAVE TPT
Tirumala Temple: తిరుమల వెంకన్నకే ఇన్ని తిప్పలా.. మే నెల శ్రీవారి హుండీ ఆదాయం మరీ ఇంత తక్కువా..!
తిరుమల
కరోనా ముందు భక్తులు స్వామి వారికి నెలకు వందకోట్ల రూపాయల వరకు హుండీ ద్వారా సమర్పిస్తుండగా...కరోనా అనంతరం ఆ ఆదాయం రూ.50 కోట్లు కూడా దాటడం లేదు. మార్చి మాసంలో అత్యధికంగా హుండీ ఆదాయం రూ.104 కోట్లు లభించగా.. మే మాసంలో గణనీయంగా తగ్గుముఖం పట్టి రూ. 11 కోట్ల 95 లక్షల రూపాయలకే పరిమితం అయింది.
కలియుగ వరదుడైన వేంకటేశ్వరుడు కొలువైన భూలోక వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రం. కరోనా ప్రభావంతో భక్తుల సంఖ్యతో పాటుగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా తగ్గుముఖం పట్టింది. టీటీడీ అంచనాకు.. వస్తున్న ఆదాయానికి పొంతన లేకుండా పోతుంది. టీటీడీ వార్షిక బడ్జెట్‌పై హుండీ ఆదాయం తగ్గడం తీవ్ర ప్రభావం చూపుతుంది. కోర్కెలు తీర్చే కోనేటిరాయుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం వివిధ రూపాల్లో శ్రీవారికి హుండీ ద్వారా కానుకలు సమర్పించుకుంటారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల రద్దీతో పాటుగా హుండీ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతుండేది. ఒక్క హుండీ ద్వారానే స్వామి వారికి భక్తులు ఏడాది పొడవున వెయ్యి కోట్లు సమర్పిస్తున్నారు. పెరుగుతున్న ఆదాయంతో పాటుగా టీటీడీ అందుకు తగ్గట్టు బడ్జెట్ అంచనాలను వేసుకుంటూ వస్తోంది. టీటీడీ ఫైనాన్స్ కమిటీ అంచనాలో వార్షిక బడ్జెట్లో 40% శాతం హుండీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాలకు దీటుగా టీటీడీ పాలకమండలి వార్షిక బడ్జెట్ అంచనా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం శ్రీవారి హుండీ ఆదాయంపై కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఏడుకొండల వాడి ఆదాయం కరోనా ముందు.. కరోనా తర్వాత అనే విధంగా పరిస్థితులు మారిపోయాయి. కరోనా ముందు భక్తులు స్వామి వారికి నెలకు వందకోట్ల రూపాయల వరకు హుండీ ద్వారా సమర్పిస్తుండగా...కరోనా అనంతరం ఆ ఆదాయం రూ.50 కోట్లు కూడా దాటడం లేదు. కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం శ్రీవారి దర్శనాలు పునః ప్రారంభించి.. సరిగ్గా ఈ రోజుకు ఏడాది కావస్తోంది.
గతేడాది జూన్ 8,9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులతో పాటుగా.. 10వ తేదీ తిరుమల స్థానికులను టీటీడీ దర్శనానికి అనుమతించింది. 11వ తేదీ సామాన్య భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తూ వచ్చింది టీటీడీ. మొదట ఆరు వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తూ వచ్చినా.. క్రమంగా ఆ సంఖ్యను 20 వేలుగాను.. మరింత ఒత్తిడి రావడంతో 50 వేల వరకు భక్తుల సంఖ్యను టీటీడీ అనుమతిస్తూ వచ్చింది. ఇంతలోనే సెకండ్ వేవ్ రావడంతో.. ఆ సంఖ్యను మళ్లీ కుదిస్తూ.. 20 వేలకు తగ్గించగా.. రాష్ట్రంతో పాటుగా దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 6 వేల వరకు దర్శన టిక్కెట్లను టీటీడీ కుందించింది.
కరోనా రాకముందు వరకు శ్రీవారి ఆదాయం ఏడాదికి ఏడాది పెరుగుతూ వచ్చింది. 2019-20 వార్షిక బడ్జెట్ అంచనాను అందుకుంది. ముఖ్యంగా శ్రీవారికి హుండీ ద్వారా వచ్చే దానితో పాటుగా దర్శనాల టికెట్లు, లడ్డూ ప్రసాదం, వసతి గదులు, కల్యాణకట్ట సహా పలు మార్గాల్లో ఆదాయం వస్తుంది. టీటీడీ అధికారిక లెక్కల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం హుండీ ద్వారా రూ. 1231 కోట్ల ఆదాయం లభించింది. అంటే నెలకు వంద కోట్లకు పైగా ఆదాయం లెక్కన సగటున రోజుకి రూ. 3 కోట్లకు తగ్గకుండా ఆదాయం వస్తుంది. ప్రస్తుతం యాత్రికులు రాకపోవడంతో టీటీడీకి ఇతర ఆదాయ మార్గాలూ నిలిచిపోయాయి. అందులో ప్రధానమైనది లడ్డూ ప్రసాదం విక్రయం. లడ్డూ ప్రసాదం విక్రయాలతో రూ. 270 కోట్ల రాబడి వచ్చింది. సగటున రోజుకి రూ.80 లక్షలు దీనిపై ఆదాయం లభించింది.
శీఘ్ర దర్శనం, ఇతర దర్శన టికెట్ల ద్వారా గత ఏడాది రూ.235 కోట్ల ఆదాయం రాగా....కల్యాణ కట్టలో సమర్పించే తలనీలాలు ద్వారా రూ. 100 కోట్లు, కల్యాణ మండపాల అద్దె రూపంలో రూ.105 కోట్లు, ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాల అద్దెలతో పాటుగా టోల్ ఫీజు అన్నీ కలిపి మరో రూ. 204.85కోట్ల ఆదాయం టీటీడీకి సమకూరింది. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను టిటిడి రూ.3,116.25 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించగా, రూ.3,243.19 కోట్లుగా టీటీడీ పాలకమండలి సభ్యులు బడ్జెట్‌ను సవరించారు. ఇందులో శ్రీవారి హుండీ ఆదాయాన్ని రూ.1,231 కోట్లుగా అంచనా వేశారు.. అంచనా కన్నా 50 కోట్ల రూపాయలు అధికంగా భక్తులు హుండీలో సమర్పించారు. తద్వారా రూ.1,285 కోట్లు సమకూరింది. అదేవిధంగా ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.270 కోట్లు అంచనా వేయగా రూ.330 కోట్లు ఆదాయం లభించిందని టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇవన్నీ కరోనా రాకముందు గణాంకాలు.... కరోనా అనంతరం పరిస్థితులు పూర్తిగా మారాయి. 2020 మార్చి 20వ తేదీ ముంచి జూన్ 8వ తేదీ వరకు శ్రీవారి దర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో 83 రోజుల పాటు శ్రీవారి దర్శనాలను కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా టీటీడీ నిలిపివేసింది. దీంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యతో పాటుగా హుండీ ఆదాయం గణనీయంగా తగ్గింది. 2020-21వ వార్షిక సంవత్సరానికి హుండీ ఆదాయం 13 వందల కోట్లు అంచనా వేయగా.. టీటీడీ అంచనాలను తలక్రిందులు చేస్తూ... రూ.721 కోట్లు రూపాయల ఆదాయం లభించింది. దీంతో టీటీడీ వార్షిక బడ్జెట్ సైతం రివైజ్డ్ చేసి.. రూ.2,553 కోట్లకు పాలకమండలి కుదించింది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.2,837 కోట్ల రూపాయలు అంచనా వేశాయి పాలక వర్గాలు. అయితే ఈ ఏడాది కూడా శ్రీవారి హుండి ఆదాయం భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. మార్చి మాసంలో అత్యధికంగా హుండీ ఆదాయం రూ.104 కోట్లు లభించగా.. మే మాసంలో గణనీయంగా తగ్గుముఖం పట్టి రూ. 11 కోట్ల 95 లక్షల రూపాయలకే పరిమితం అయింది. దీంతో మరోమారు టీటీడీ బడ్జెట్ రివైజ్డ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనే చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.