GT Hemanth Kumar, Tirupathi, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు (Nara Chandra Babu Naidu) ఈ నెలాఖరులో తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించబోతున్నారు. పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు, నియోజకవర్గంలో అధికార పార్టీకి పెరుగుతున్న మద్దతు దృష్ట్యా బాబు ఈ పర్యటనపై అందరి దృష్టిపడింది. చంద్రబాబు ఈ టూర్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు. తమ్ముళ్ల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిస్కరిస్తూనే.. నియోజకవర్గంవ్యాప్తంగా ఆయన పర్యటన కొనసాగనుంది. గురువారం మధ్యాహ్నం కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకోనున్న చంద్రబాబు బస్టాండ్ ఆవరణలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక మొదటి రోజు పలు పార్టీ కార్యక్రమాల్లో బిజి బిజిగా గడపనున్నారు ఏపీ ప్రతిపక్ష నేత. కానీ తాను బస చేసే విషయంలో మాత్రం చంద్రబాబు వినూత్న నిర్ణయం తీసుకున్నారట.
కుప్పంకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోనే బస చేసే వారు. కానీ ఈ పర్యటనలో ఆయన బస్సులోనే బసచేయనున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఉండగా చంద్రబాబు కార్ వ్యాన్ లో బస చేయాల్సిన అవసరం ఏముందనే దానిపై చర్చ జరుగుతోంది. ఐతే చంద్రబాబు అలాంటి నిర్ణయం ఎందుకు తీసున్నారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 24, 25, 26 తేదీల్లో కుప్పం పర్యటన సందర్భంగా ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌసులో బస చేసారు. ఆయన బస చేసిన సమయంలో పలుసార్లు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఫిబ్రవరి 25న తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల వరకు.. ఉదయం 7.30 నుంచి 8.30గంటల వరకు గెస్ట్‌హౌస్ కు పూర్తిగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో గెస్ట్ హౌస్ లో నిద్రిస్తున్న చంద్రబాబుకు నిద్ర లేకపోవడమే కాకుండా.. స్నానానికి వేడి నీళ్లు కూడా దొరకలేదు. అప్పట్లో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐతే అధికార పార్టీ నేతలు సంబంధిత అధికారులను బెదిరించి ఉద్దేశపూర్వకంగా కరెంటును కట్ చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు.
ఇలాగే చంద్రబాబు బసచేసిన సమయంలో గదిని శుభ్రం చేయకపోవడం, బెడ్డు కింద బిర్యానిలోమిగిలిన చిక్కెన్ ముక్కలు, కప్‌బోర్డులో మందు బాటిళ్ల మూతలు ఉండటంతో అధికారులపై అప్పట్లో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటిచేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు కార్వాన్ లోనే బస చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ఆవరణలో బస్సు ఆపి, అందులోనే నిద్ర, స్నానం, భోజనం చేస్తారు. నాయకులతో సమావేశాలను మాత్రం అతిథి గృహంలో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Kuppam, TDP