GT Hemanth Kumar, News18, Tirupati
నిత్య శ్రమ జీవులు రైతు కుటుంబాలు. పగలు.., రాత్రి అని తేడా లేకుండా పంట పొలాలపై మమకారాలు చూపుతూ పది మంది ఆకలి తీర్చాలని కోరుకుంటాడు అన్నదాత. పంట చేతికి వచ్చినా గుప్పెడు మెతుకులు... పట్టెడు అన్నం కోసం శ్రమిస్తూనే ఉండాలి. ఆకలి కేకలు పెడుతున్న బిడ్డలా పొలాన్ని సాగు చేసి జనం ఆకలి అనే బాధ లేకుండా చేస్తున్నారు రైతులు, అలాంటి అన్నదాతల జీవితాల్లో వెలుగు దేవునికి ఎరుక పూట గడవనివారు ఎందరో ఉన్నారు ఈ సమాజంలో. పొలంలో సాగు చేయాలంటే కచ్చితంగా నాగలి పట్టాలి. పంట వేసే ముందు దుక్కి దున్ని... నారు పోసి... నీరు పెట్టాలి. కానీ ఓ రైతు వద్ద ఎద్దులు లేవు... ఇక యంత్రంతో దుక్కి దున్నాలంటే డబ్బులు లేని దీన స్థితి. దీంతో ఆ రైతు కుమారులతో తన గోడు చెప్పుకున్నాడు.. తనకు మద్దతుగా నిలబడి సహాయం చేయాలనీ కోరాడు. చివరికీ కుమారులే జోడెద్దులుగా మారి పొలం దున్నిన హృదయ విదారకమైన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా (Chittoor District) లో చోటు చేసుకుంది.
వి.కోట మండలంలోని కుంబార్లపల్లె గ్రామంలో సమీవుల్లా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామంలో కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నాడు. తమ కుటుంబం తరతరాలుగా వ్యవసాయం చేస్తుండటంతో తాను వ్యవసాయంపైనా ఆధారపడ్డాడు. సమీవుల్లాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆదాయం అంతంత మాత్రమే కావడంతో పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలో చదివిస్తున్నాడు. వ్యవసాయం ఆధారంగా వచ్చే ఆదాయం కుటుంబ పోషణకే సరిపోతోంది. ఇక ముగ్గురు పిల్లల చదువులకు అవసరం అయ్యే వస్తువులను అప్పు చేసి కొనుగోలు చేయడం.. మరలా డబ్బులు సమకూర్చి అప్పులు చెల్లించడం చేసేవాడు.
ఇది చదవండి: ఏపీని వదలని వాన.. 15 జిల్లాలకు అలర్ట్..
కరోనా కారణంగా గత రెండేళ్లుగా సమీవుల్లా తీవ్ర ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోయాడు. కనీసం పంటకు చెదుళ్ళు పట్టిన సమయంలో మందులు సైతం కొనేందుకు సమీవుల్లా తీవ్రంగా ఇబ్బందులు పడేవాడు. దీంతో పొలం దున్నేందుకు ట్రాక్టర్ కాదుకదా కనీసం ఎద్దులను కూడా సమకూర్చుకోలేకపోయాడు. దీంతో చేసేది లేద తన పిల్లల సహాయంతో పొలం దున్ని సాగుచేస్తున్నాడు. కాడెద్దుల స్ధానంలో కుమారులతో వ్యవసాయ పొలంను దుక్కి దున్నాడు. ఈ ఘటన చూసిన కొందరు స్ధానికులు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.
వ్యవసాయంపై మమకారంతో తనకు స్ధొమత లేకున్నా పిల్లల సాయంతో కాడిపట్టి నాగలితో దుక్కి దున్ని, పాదులు చేయించాడు సమీవుల్లా. అంతేకాకుండా బురదమట్టిలో సైతం పిల్లలసాయంతో నాగలితో దున్నడం దుక్కించడంను చూసిన స్ధానికులు కన్నీళ్ళు పెట్టించింది. తమ తండ్రి నిస్సహాతను గమనించిన కుమారులు, కుమార్తె మేమున్నామంటూ తండ్రి సమీవుల్లాకు అండగా నిలబడి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Farmer