GT Hemanth Kumar, Tirupathi, News18
అదో ఉన్నత విద్యాలయం. విద్యార్థినుల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయం. అక్కడ విద్య నేర్పించే గురువులు దేవుళ్లతో సమానం. జీవితంలో ఏదో సాధించాలని కాలేజీకి వచ్చే యువతులను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన గురువు వక్రబుద్ధితో చూశాడు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన తానే చెడ్డదారిలో వెళ్లాడు. చదవు చెప్పాల్సిన చోట పాడుపనులకు పూనుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రతిష్టాత్మకమైన టీటీడీ (TTD) మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్ కీచకుడిలా మారాడు. చదువు కోసం, భవిష్యత్తు కోసం వేధింపులను భరిస్తూ వచ్చిన స్టూడెంట్స్ చివరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఐతే ఈ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోకుండా అధికారులు చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది.
తిరుపతిలోని ఎస్వీ ఓరియంటల్ మహిళా కళాశాల డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తోంది. రాష్ట్రంలో పేరున్న మహిళా కళాశాల కావడంతో రాయలసీమతో పాటు ఏపీలోని ఇతర జిల్లాల నుంచి అమ్మాయిలు ఇక్కడ చదువుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. పైగా ఇక్కడ హాస్టల్ వసతి చాల చక్కగా ఉండటంతో ఓరియంటల్ కళాశాలకు డిమాండ్ కూడా ఎక్కువే. ప్రతిష్టాత్మకమైన ఈ కళాశాలకు కొన్నేళ్లుగా సురేంద్ర నాయక్ ప్రినిసిపాల్ గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల సురేంద్ర నాయక్ వ్యవహార శైలి వివాదస్పదమవుతోంది. కొంతకాలంగా కళాశాలలోని విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడన్న ఆరోపణలు గుప్పమన్నాయి. ప్రిన్సిపాల్ సురేంద్ర నాయక్ తో పాటు హాస్టల్ వార్డెన్ రామనాధం కూడా తమను వేధిస్తున్నట్లు స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు.
ఈ విషయాన్ని బాధిత విద్యార్థునులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో డీఈఓ స్థాయి అధికారి అయిన గోవిందరాజులతో విచారణ సాగించారు. విచారణలో ప్రిన్సిపాల్ సురేంద్రనాయక్, వార్డెన్ రామనాథంపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. దీంతో ఉన్నతాధికారులు ఇద్దర్నీ సస్పెండ్ చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ప్రిన్సిపాల్ తో పాటు వార్డెన్ ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణకు కమిటీ వేయడం సరికాదని.. వెంటనే ఇద్దరిపైనా దిశ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ధర్నాకి దిగారు. కాలేజీకి మహిళా ప్రిన్సిపాల్ తో పాటు హాస్టల్ కు మహిళా వార్డెను నియమిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని విద్యార్థులంటున్నారు. ఇకపై ఇలాంటి ఘటను జరగకుండా ఉండాలంటే వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటున్నారు.
ఇదిలా ఉంటే విజయవాడలోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు.. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థినులు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఐతే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరు మాత్రం ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని.. కావాలనే ఇరికిస్తున్నారని ఆరోపించారు. దీనిపై సిద్ధమైన నివేదికలోనూ ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని.. కేవలం దూషించారని పేర్కొనడం గమనార్హం.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Harassment, Tirupati, Ttd