GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది ఏపీ ప్రభుత్వం. గతవారం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పెద్ద తననొప్పిగా మారింది. స్థానికులకు కాదని స్థానికేతరులకు కేటాయించడంపై ద్వితీయ శ్రేణి నాయకులూ అసహనంతో ఉన్నారట. ఏళ్ల నాటి సంప్రదాయాలను కాదని బయట వ్యక్తులకు పదవులు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. సొంత వారిని కాదని ఇతర ప్రాంతాల వారికీ ఎలా ఇస్తారని నిలదీస్తున్నారని సమాచారం. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఏకంగా 11 పదవుల పంపకాలు జరిగాయి. కానీ జిల్లాలో రెండు దేవాలయాల చైర్మన్ నియామకాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంటేశ్వరుని దేవస్థానం అనంతరం జిల్లాలో శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు ప్రముఖ దేవాలయాలుగా ఉన్నాయి. ఆ దేవాలయాల నామినేటెడ్ పదవుల వ్యవహారం సొంత నియోజకవర్గ ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టింది. ఎమ్మెల్యే ద్వితీయ స్థాయి నేతల మధ్య వివాదం చెలరేగడానికి నామినేటెడ్ పదువులే కారణమనే చర్చ ఇటు పూతలపట్టు నియోజకవర్గంలోను, అటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చర్చ సాగుతోంది.
ఎన్నో ఏళ్ళ నాటి నుంచి ఈ ఆలయాలకు కమిటీ చైర్మన్లుగా స్థానికులనే నియమిస్తూ వచ్చేది అధికారంలో ఉన్న ప్రభుత్వాలు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం స్థానికులకు కాదని తొలిసారి స్థానికేతరులను నియమించింది. ఆలయ చైర్మన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులకు నిరాశే మిగిల్చింది. ఇటు కాళహస్తి.., అటు కాణిపాకంలో ఇలాంటి పరిస్థితే ఎదురు కావడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. ప్రతిపక్షంలో ఉన్నన్ని నాళ్ళు పార్టీ కోసం చొక్కాలు చింపుకున్నామని ఉద్యమాలు చేసి రోడ్డెక్కి పోలీస్ కేసులు ఎదుర్కొనడమే కాకుండా పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టి అప్పులపాలు అయ్యామని లోకల్ పార్టీ క్యాడర్ వాదన. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయినా ఎలాంటి పదవులు ఇవ్వలేదని.., ఇప్పుడు చైర్మన్ విషయంలో అన్యాయం జరిగిందని..., సభ్యుల విషయంలోనూ పునరావృతం అవుతుందని ఎమ్మెల్యేల వద్ద వాదనకు దిగారట పార్టీ నాయకులు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుల చుట్టూ పార్టీ నాయకులు చుట్టూ తిరుగుతున్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి పదే పదే ప్రస్తావిస్తునట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలకు తలనొప్పులు తెచ్చిపెట్టినట్లు సమాచారం. అయితే కాణిపాకం ఆలయ బోర్డు చైర్మన్ గా మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి వదినైన చిత్తూరుకు చెందిన ప్రమీలమ్మ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. కాణిపాకం ఆలయానికి సంబంధించి 14 గ్రామాల ఉభయ దారుల ఆధిపత్యం ఉంటుంది. అయితే ఉభయ దారులను కాదని బయట వ్యక్తులను నియమించడంతో ఉభయ దారులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఇదే అంశాన్ని ఎంఎస్ బాబు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 14 గ్రామాల ఉభయ దారులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో పార్టీలకు అతీతంగా పాల్గొని. స్థానికులకే చైర్మన్ పదవిని కేటాయించాలి కోరారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుంటే కోర్టుకు వెళ్తామని వారు హెచ్చరిస్తున్నారు. అధికార వైసీపీకి చెందిన నాయకులూ సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలోను ఇదే అసమ్మతి సెగ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ కు ఎదురవుతోంది. శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ గా సత్యవేడు నియోజకవర్గనికి చెందిన బిజేంద్ర వర్మను ప్రభుత్వం నియమించింది. పార్టీ కోసం ఆది నుంచి కృషి చేస్తూ వస్తున్న ఏందరో నేతలు చైర్మన్ పదవి తమకే ఖాయమని ఆశలు పెట్టుకున్నారు. తీరా ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో కాళహస్తి వాసికి చోటు లేకపోగా బయట వ్యక్తులను నియమించడంతో పార్టీ నాయకుల్లో తీవ్ర నిరాశ నింపింది. వారందరు ఎమ్మెల్యే వద్ద పంచాయితీ పెట్టి ఇదేంటని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు పదవుల వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. తమ ప్రమేయం ఇందులో ఏమాత్రం లేదని జిల్లాలో పెద్దాయన ప్రమేయంతోనే స్థానికేతరులకు ఆలయ చైర్మన్ పదవులు దక్కాయని వాపోతున్నారట. స్థానికులకు కాకుండా బయట వ్యక్తులకు పదవులు కట్టబెట్టడంతో తమను నమ్ముకున్న వారికి ఎలా న్యాయం చేయాలని ఇద్దరు ఎమ్మెల్యేలు లోలోన మధనపడుతున్నట్లు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి తన తోడు నడిచిన వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదట. ఎమ్మెల్యేలు చెప్పిన నాయకులూ మాత్రం నమ్మే స్థితిలో లేరని అంటున్నారు. దీంతో ఆలయ కమిటీ వ్యవహారం ద్వారా పార్టీలో చీలికలు వచ్చే ఆస్కారం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఎటువైపుకు దారి తీస్తుందో తెలియడం లేదని జిల్లా పార్టీ లో ఆందోళన నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ysrcp