వృద్దాప్యంలో ఉన్నవారికి తమ కుమారులే శ్రీరామ రక్ష. ఎలాంటి ఆధారం లేని వృద్ధులు ప్రభుత్వాలు ఇచ్చే పధకాల ద్వారా జీవనాధారం పొందుతుంటారు. ఇలా వచ్చే రేషన్ సరుకులతోను వచ్చే పెన్షన్ (YSR Pension Scheme) డబ్బులతో తమ బతుకు బండిని లాగిస్తుంటారు. ఆలా వచ్చే పెన్షన్., రేషన్ ఒక్కసారిగా నిలిచిపోతే ఆ వృద్ధుల పరిస్థితి ఏంటి. గత కొన్నేల్లుగా ఆ వృద్ధురాలికి వస్తున్న పెన్షన్ గత రెండు మాసాలుగా ఆగిపోయింది. తనకు ఎందుకు పెన్షన్ రాలేదో తెలియక ఎమ్మార్ఓ కార్యాలయం చుట్టూ తిరిగిన ఆ వృద్ధురాలికి కళ్ళు చెమ్మగిల్లేలా మాట చెప్పారు సచివాలయ సిబ్బంది. మీరు చనిపోయారట, రికార్డ్స్ పరంగా మీరు చనిపోయినట్లు చూపిస్తుందని సిబ్బంది చెప్పారు. వారు చెప్పిన మాట విని ఆ వృద్ధురాలు జీవనాధారంగా ఉన్న పెన్షన్ ఇవ్వాలని కంటతడి పెడుతూ ప్రధ్యేయా పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లాలో (Chittoor District) చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.., చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లె పంచాయతీ మహేశ్వరపురంలో టి చిన్నక్క నివాసం ఉంటుంది. ఈమెకు ఇప్పటికే 90 ఏళ్ళు దాటాయి. కానీ ప్రభుత్వ రికార్డ్ పరంగా 75 ఏళ్లుగా నమోదు అయ్యి ఉంది. కొన్నేళ్ల క్రితం చిన్నక్క భర్త మృతి చెందడంతో అప్పటి నుంచి చిన్నక్క ఒంటరిగా బ్రతుకుతోంది. ప్రభుత్వం ద్వారా వస్తున్న పింఛనుతో, రేషను బియ్యంతో కడుపు నింపుకుంటోంది. పది నెలలుగా చిన్నక్కకు రేషన్ రాలేదు. ఇక పెన్షన్ రెండు నెలలుగా నిలిచిపోయింది. అసలు కారణం ఏంటంటే రికార్డ్ పరంగా చినక్క చచ్చిపోయినట్లు ఉండటమే. అధికారుల దగ్గరకు వెళ్లి తాను బ్రతికే ఉన్నానని తనకు రేషన్, పెన్షన్ కల్పించాలని కోరుతోంది. చనిపోయిన వాళ్లకు పింఛను ఇవ్వడం కుదరదని, పైఅధికారులకు తెలిస్తే ఉద్యోగాలు పోతాయని ఇప్పుడు సిబ్బంది కూడా భయపడుతున్నారు.
దీని వల్లే గత రెండు నెల నుంచీ పింఛన్ ఇవ్వలేదని పేర్కొన్నారు.ఇంక బతికేదెట్రా బగమంతుడా అని చినక్క కన్నీళ్ళు పెట్టుకుంటోంది. "అయ్యా సీఎం గారు నేను బ్రతికే ఉన్నాను. ఎదురు కట్టే మాదిరిగా భూమిపై తిరుగుతూనే ఉన్నాను నాయన నేను. ఈ సార్లు మాత్రం నేను చనిపోయానంటూ చెప్పేస్తున్నారు. నేను ఏమి దెయ్యాన్ని కాదు స్వామి. నా జీవనోపాధికి పింఛన్., రేషన్ కార్డు ఇప్పించాలని కోరుకుంటున్న నాయన" అంటూ చిన్నక్క కన్నీరు మున్నీరు అవుతుంది.
ఇటీవల ఏపీలోని ఓ ప్రాంతంలో దాదాపు 80ఏళ్ల వయసున్న వృద్ధురాలి వయసు కేవలం 16ఏళ్లుగా నమోదు చేయడంతో పింఛన్ నిలిచిపోయింది. దీంతో ఆమె అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కాటికి కాళ్లుచాచిన తనకు వయసు 16ఏంటని అధికారులను నిలదీసినా వారి నుంచి సమాధానం కరువైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారి చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా అవి ప్రజల జీవితాలపై తీవ్రప్రభావం చూపుతాయనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.