తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా (Chittoor District) కుప్పం (Kuppam) పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాక సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఐతే ఫ్లెక్సీలు ధ్వంసం కావడంతో రాజకీయ రచ్చ మొదలైంది. కుప్పంలోని లక్ష్మీపురం క్ల్రాస్ రోడ్ వద్ద టీడీపీ బ్యానర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే తమ బ్యానర్లను చించేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు కుప్పం వచ్చిన సందర్భంగా ఇదే ప్రాంతంలోని ఫ్లెక్సీలను తగులబెట్టడంతో దుమారం రేగింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం చంద్రబాబు బహిరంగ సభకు ర్యాలీగా వెళ్తున్న టీడీపీ నేతలను వి.కోట పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని నిలిపివేశారు. దీంతో పలమనేరు-కుప్పం జాతీయ రహదారిపై టీడీపీ నేతలు బైఠాయించారు. తమ అధినేతపై అభిమానంలో ర్యాలీగా వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదని.. ఇది ప్రభుత్వ పిరికిపంద చర్యని తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు వారికి అనుమతివ్వడంతోఅంతా సర్దుకుంది.
ఇదిలా ఉంటే 8నెలల తర్వాత చంద్రబాబు కుప్పం వెళ్తున్నారు. తొలుత నియోజకవర్గమంతా పర్యటించాలని భావించినా.. ఆయన కేవలం కుప్పం వరకే పరిమితమవుతారని తెలుస్తోంది. ఇక కుప్పం వచ్చిన ప్రతిసారీ స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బసచేసే ఆయన ఈసారి మాత్రం తన సొంత బస్సులోనే బసచేయాలని నిర్ణయించుకున్నారు. గత పర్యటన సందర్భంగా గెస్ట్ హౌస్ లో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేయడం, తన రూమ్ ను శుభ్రం చేయకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..! ఈ నేపథ్యంలో ఆయన తన కార్వాన్ లోనే బస చేయాలని నిర్ణయించారు. స్నానం, భోజనం, నిద్ర వంటివి బస్సులోనే ముగించుకోనున్న చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశాలను మాత్రం గెస్ట్ హౌస్ లో నిర్వహించనున్నారు.
ఇది చదవండి: క్రిస్టియన్ కు టీటీడీలో సభ్యత్వం..? వైసీపీ ఎమ్మెల్యే మతంపై వివాదం.. ఆయన ఏమన్నారంటే..!
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు తొలిసారి కుప్పం వెళ్తున్నారు. త్వరలోనే కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశముండటంతో బాబు పర్యటనపై ఆసక్తి నెలకొంది. అలాగే ఇటీవల నియోజకవర్గంలోని టీడీపీ నేతల మధ్య కుమ్ములాటలు, నాయకుల మధ్య సమన్వయ లోపం, కార్యకర్తలకు భరోసా కల్పించే అంశాలపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించనున్నారు. నియోజకవర్గంలో కలిసి పనిచేయాలని.. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని బాబు సూచించే అవకాశముంది. మరోవైపు ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాబు టూర్ కు వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. గత పర్యటన సందర్భంగానూ పలువురు వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు ర్యాలీని అడ్డుకున్న సంగతి తెలిసిందే..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Kuppam