GT Hemanth Kumar, Tirupati, News18
ప్రభుత్వ అధికారులు (Government Officials) అంటేనే తటస్తంగా ఉండేవారని అర్థం. ప్రభుత్వాలు ఏదైనా ప్రజలకు మాత్రమే సేవ చేయడమే వారి లక్ష్యం. నిరంతరం ప్రజా సేవ చేస్తూ.., ప్రజలకు అవసరమైన పనులు, పధకాలు అందించడమే వారి కర్తవ్యం. ముఖ్యంగా పోలీస్ శాఖ (Police Department). నిరంతరం లాండ్ ఆర్డర్ కాపాడుతూ అన్యాయాన్ని అరికట్టేది పోలీసులే. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా రక్షణ కల్పించేది పోలీసులే. అధికార ప్రతిపక్ష పార్టీలకు అతీతంగా ఉండాలి. అన్యాయం చేసింది అధికార పక్షం అయినప్పటికీ వారిని ఎదురించే విధంగా పోలీసులు తమ వృత్తిని కొనసాగించాలి కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ సర్కిల్ ఇన్ఫసెక్టర్ మాత్రం ఎమ్మెల్యేపై స్వామిభక్తిని చాటుకున్నారు. ఏకంగా మా ఎమ్మెల్యే సారూ సింహం లాంటోడు అని వ్యాఖ్యానించాడు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఎమ్మెల్యేకు బందోబస్తుగా వెళ్ళిన సదరు సిఐ ఎమ్మెల్యేపై పొగడ్తల వర్షం కురిపించి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కాస్త విమర్శలకు తావిస్తోంది.
అధికార పార్టీ ఎమ్మెల్యేల పట్ల బహిరంగంగానే ప్రభుత్వ అధికారులు మితిమీరిన స్వామి భక్తి చూపిస్తుండటం వివాదాలకు కారణం అవుతోంది. అనంతపురం జిల్లా (Anantapuram District) గుత్తి పట్టణంలో గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి పై గుత్తి సిఐ రాము పొగడ్తల జల్లు కురిపించడం చర్చనీయాంశమైంది. ఓ ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటుచేసిన జిమ్ ప్రారంభోత్సవానికి గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బందోబస్తూ కల్పించడానికి వెళ్లారు సిఐ రాము.
ఇది చదవండి: బద్వేలు ఉపఎన్నికపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి... సీనియర్ మంత్రికి బాధ్యతలు..!
ఈ సందర్బంగా ఆయనను మాట్లాడాలని కార్యక్రమ నిర్వాహకులు కోరారు. ముందు వద్దు అని చెప్పిన ఎస్సై.., ఆ తరువాత మొహమాటం కొద్దీ కార్యక్రమంలో చేతిలో మైక్ అందుకున్న సిఐ మన ఎమ్మెల్యే సింహం లాంటోడని.., 100 గొర్రెలకు ఒక సింహం నాయకత్వం వహిస్తే గొర్రెలు కూడా సింహాలు అవుతాయంటూ కేజీఎఫ్ స్టైల్లో డైలాగులు పేల్చారు. ఎవరికి ఏమి కావాలో ఎప్పుడు కావాలో ఎక్కడ కావాలో అడగకపోయినా ఎమ్మెల్యే సార్ చేస్తారని కెజిఎఫ్ డైలాగ్ తో పొగడ్తల జల్లు కురిపించారు.
ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో పోలీస్ శాఖపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పోలీసులు రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి బాహాటంగానే పొగుడుతూ, వంగి వంగి దండాలు పెడుతున్నారని ఇక సామాన్య ప్రజలకు ఏం న్యాయం అందిస్తారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసు బాసులు ఇలాంటి ఘటనలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు.. ఓ ఎమ్మెల్యేను కార్యకర్త మాదిరిగా పొగిడిన సీఐగారపై చర్యలు తీసుకుంటారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, AP Police