GT Hemanth Kumar, News18, Tirupati
Tirumala Temple: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు... ఆపద మొక్కుల వాడు., భక్తుల పాలిట కల్పతరువుగా... కోరిన కోర్కెలు తీర్చే ఆ శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. వెంకటేశ్వరుడు (Sri Venkateswara Swamy) కొలువై ఉన్న ఏడుకొండలు ఎంతో పవిత్రమైనవి. అందుకే సప్తగిరులను శ్రీవారి సన్నిధిగానే భావిస్తారు. భక్త కౌసల్యుని దర్శనంతోనే కాదు అయన వెలసిన దివ్యధామమైన తిరుగిరుల్లో పాదాలు మోపినా మోక్షం సిద్ధిస్తుంది. గంటల తరబడి క్యూ లైన్లో వేచియున్నా.., శ్రీవారి క్షేత్రంలో అడుగు పెట్టిన జన్మజన్మల పున్యంతో పాటుగా దివ్యాశీస్సుకు లభిస్తాయని భక్తుల భక్తుల విశ్వాసం. ప్రస్తుతం కోవిడ్ కారణంగా తిరుమల కొండకు పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తోంది టీటీడీ (TTD). కోవిడ్ కు ముందు తరువాత అనే విధంగా భక్తులను అనుమతి విధానంలో మార్పులు చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే నిబంధనల పేరుతో భగవంతునికి భక్తులకు మధ్య దూరం పెంచేస్తున్నారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. ఇందుకు ప్రధాన కారణం దర్శన అనుమతితో మార్పులే.
కొవిడ్ కారణంగా శ్రీవారి దర్శన విధానంలో టీటీడీ మార్పులు తీసుకొచ్చింది. ఆన్ లైన్ టోకెన్లు, ప్రజాప్రతినిధుల సిపార్సు లేఖలు, శ్రీవాణి ట్రస్టు దాతలను తిరుమలకు అనుమతిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిబంధనల పేరుతో క్రింది స్థాయి ఉద్యోగులు భక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అలిపిరి వద్దనే ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ చేసేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 20 నుంచి 28 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇందులో ఆన్లైన్ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 8 వేల టిక్కెట్లు... వర్చువల్ సేవ ద్వారా మరో 5,500 టిక్కెట్లను జారీ చేస్తుంది టీటీడీ. ఇక శ్రీవాణి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజ్యాంగ హోదాలో ఉన్న వారి సిఫార్సు లేఖలపై మరో 8 వేల టిక్కెట్లను టీటీడీ జారీ చేస్తోంది. ఇక టీటీడీ పాలకమండలి చైర్మన్ కోటాలో మరికొన్ని అదనపు టిక్కెట్లు కేటాయిస్తుంటారు. పరిమిత సంఖ్యలో తిరుమలకు వస్తున్న భక్తులకు టీటీడీ విజిలెన్స్ ఆంక్షలు మాత్రం తప్పడం లేదు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు.
ఇక సిఫార్సు లేఖలు వెంట తెచ్చుకున్న భక్తులకు ముందస్తుగా ఎలాంటి ప్రత్యేక టిక్కెట్లను కలిగి ఉండరు. భక్తులు వెంట తెచ్చుకున్న సిఫార్సు లేఖతో టీటీడీ అదనపు ఈవో కార్యాలయానికి చేరుకొని ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అదేరోజు సాయంత్రానికి వారికి టిక్కెట్లను జారీ చేస్తారు. ఇక శ్రీవాణి ట్రస్ట్ భక్తులు తిరుమలకు వెళ్లి 10 వేల రూపాయలు చెల్లిస్తే తప్ప టిక్కెట్లు పొందలేరు. వీరిని తిరుమలకు పంపే వీలు లేకుండానే అలిపిరి వద్దే ఆంక్షల పేరుతో అడ్డుకుంటున్నారు. టిక్కెట్టు లేకూండా తిరుమలకి అనుమతించం అంటూ ఇబ్బదులకు గురిచేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి.
ఇటీవల తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు తన భార్యతో కలసి శ్రీవారి దర్శనానికి వచ్చాడు. ఐతే అతడ్ని అలిపిరి చెక్ పోస్ట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. టికెట్ లేనిదే అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కొంత సమయానికి నేరుగా సెక్యూరిటీ జామేదార్ వద్దకు చేరుకొని తాను శ్రీవాణి టికెట్ కొనుగోలు చేసుకొని శ్రీవారిని దర్శించుకుంటానని చెప్పాడు. దీంతో ఆ జమేదార్ పై అధికారులను అడిగి పంపుతానని గంటపాటు తనిఖీ కేంద్రం వద్దనే ఉంచారు. చివరకు ఓ మీడియా ప్రతినిధి చొరవతో తిరుమలకు చేరుకొని శ్రీవాణి టికెట్ పొంది శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇలా వారి ఆంక్షలతో శ్రీవారి దర్శనమే కాకుండా కనీసం తిరుమల కొండపైకి కాలు మోపే వీలు లేకుండా పోతోందని భక్తులు వేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉప ఆలయాల సందర్శించడం ద్వారా శ్రీవారి ఆశీస్సులు లభిస్తుందన్న భక్తుల ఆశలపై టీటీడీ విజిలెన్స్ నీళ్లు చల్లుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirumala Temple, Tirumala tirupati devasthanam