Mercy Killing: ఎంతటి విషాదం.. కొడుకును అలా చూడలేక అతని కారుణ్య మరణానికి అనుమతి కోరేందుకు వెళితే..

హర్షను తీసుకెళుతున్న బంధువు

ఆ బాలుడిది ఆడుతూపాడుతూ గడిపే వయసు. ప్రమాదవశాత్తూ జరిగిన ఓ దుర్ఘటన ఆ పదేళ్ల బాలుడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ బాలుడి బాధను చూసి ఆ కన్న హృదయం కన్నీరుమున్నీరైంది. కాస్త కఠినంగానే అనిపించినప్పటికీ కొడుకు పడుతున్న బాధను చూడలేక ఆ బాలుడి కారుణ్య మరణం కోసం కన్న తల్లే కోర్టును ఆశ్రయించింది.

 • Share this:
  ఆ బాలుడిది ఆడుతూపాడుతూ గడిపే వయసు. ప్రమాదవశాత్తూ జరిగిన ఓ దుర్ఘటన ఆ పదేళ్ల బాలుడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ బాలుడి బాధను చూసి ఆ కన్న హృదయం కన్నీరుమున్నీరైంది. కాస్త కఠినంగానే అనిపించినప్పటికీ కొడుకు పడుతున్న బాధను చూడలేక ఆ బాలుడి కారుణ్య మరణం కోసం కన్న తల్లే కోర్టును ఆశ్రయించింది. కన్నతల్లి పడుతున్న బాధను చూడలేక పోయాడో ఏమో ఆ బాలుడు.. కోర్టుకు సెలవు కావడంతో తిరిగి ఇంటికి వెళుతుండగా దారి మధ్యలోనే కన్నుమూశాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చౌడేపల్లె మండలం బిర్జేపల్లికు చెందిన అరుణ అనే మహిళకు హర్షవర్ధన్ అనే పదేళ్ల బాబు ఉన్నాడు. అందరి పిల్లలతో కలిసి సరదాగా ఆడుతూపాడుతూ ఉన్న తన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. స్కూల్‌కు పంపించి హర్షను చదివించారు. కానీ.. ఆ బాలుడిని చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో గానీ.. నాలుగు సంవత్సరాల క్రితం హర్షవర్ధన్ ఒకరోజు స్కూల్‌లో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తూ స్కూల్ మిద్దిపై నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో ఆ బాలుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఒక్క ఘటన హర్షవర్ధన్ కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేసింది. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఎంతో చలాకీగా ఉండే హర్షను మంచానికే పరిమితం చేసింది. వైద్యులు చికిత్స అందించినప్పటికీ హర్షవర్ధన్‌ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. అయితే గత నెల నుంచి హాస్పిటల్‌లో చికిత్స చేయిస్తున్నప్పటికీ ముక్కుల్లో నుండి రక్తం ధారగా కారుతుందని, కాలకృత్యాలకు వెళ్ళినా రక్తం పడుతుండడంతో వైద్యులు తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పారని హర్ష తల్లి అరుణ ఆవేదన వ్యక్తం చేసింది.

  రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న అరుణ కుటుంబం హర్షకు వైద్యం చేయించే స్థితిలో లేదు. రోజురోజుకూ హర్ష ఆరోగ్యం క్షీణిస్తోంది. కొడుకుకు వైద్యం చేయించలేని తమ ఆర్థిక పరిస్థితిని తలుచుకుని బాధపడటం తప్ప ఈ కుటుంబం ఏం చేయలేకపోయింది. బాలుడి తల్లి అరుణ కొడుకును ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయింది. తన కొడుకు రోజూ అలా బాధపడే కన్నా ఒకేసారి చనిపోతే అతనికీ శాంతి దొరుకుతుందని ఆమె భావించింది. కారుణ్య మరణానికి అనుమతివ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. భర్త, బంధువైన మరో మహిళతో కలిసి కొడుకును ఆటోలో ఎక్కించుకుని పుంగనూరు కోర్టు వద్దకు చేరుకుంది. అయితే.. కోర్టుకు సెలవు కావడంతో ఇంటికి తిరుగు పయనమైంది.

  ఇది కూడా చదవండి: Gorantla Madhav: ‘అంతా నా ఇష్టం.. నాకు రూల్స్ లేవు’ అంటున్న ఎంపీ గోరంట్ల మాధవ్.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలోనూ అదే వరస..!

  ఆ తల్లి బాధను చూసి తట్టుకోలేక పోయాడో ఏమో గానీ పాపం హర్షవర్ధన్ దారి మధ్యలోనే చనిపోయాడు. కారుణ్య మరణానికి దరఖాస్తు చేసేందుకు ముందుకొచ్చినప్పటికీ కొడుకు కళ్ల ముందే చనిపోతే ఏ తల్లి మాత్రం తట్టుకోగలదు. విగత జీవిగా మిగిలిన కొడుకును చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఆమె రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించి బతకలేక చావును కోరుకున్న హర్షవర్ధన్‌ను ఆ చావే వెతుక్కుంటూ రావడం శోచనీయం.
  Published by:Sambasiva Reddy
  First published: