GT Hemanth Kumar, Tirupathi, News18
కన్నబిడ్డలంటే ప్రతి తల్లిదండ్రులకు ప్రాణం కంటే ఎక్కువ. చిన్నతనంలో వారు చేసే అల్లరితో ఎంతో ఆనందిస్తారు. అమ్మచేతి గోరుముద్దలు తింటూ.. నాన్న ఒడిలో ఆడుకుంటూ సందడి చేస్తారు. అభం శుభం తెలియని వయసులో వారి అమాయక చూపులతో అందర్నీ ఆకర్షిస్తుంటారు. అలాంటి కన్నబిడ్డ కాసేపు కనిపించకపోతే ప్రాణం విలవిల్లాడిపోతుంది. అలా ఓ తల్లి కన్న బిడ్డ మూడేళ్లకే అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి వాళ్లు వెతకని చోటు లేదు.. తిరగని ప్రాంతం లేదు. కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూసిన రోజులెన్నో వారి జీవితంలో ఉన్నాయి. బిడ్డని తలుచుకొని ఏడ్చిన నిద్రలేని రాత్రులు ఆ తల్లి గడపింది. కానీ అమ్మప్రేమ ఎన్నేళ్లైనా బిడ్డనుతన దగ్గరకు చేరుస్తుందనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. మూడేళ్ల వయసులో తప్పిపోయిన కుమారుడు 14ఏళ్ల తర్వాత తల్లిచెంతకు చేరాడు. ఆ తల్లి నమ్మకాన్ని, ఎదురుచూపులను నిజం చేస్తూ తిరిగొచ్చాడు.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలంలోని నీరుగట్టువారి పల్లెలో రమణ, రెడ్డెమ్మ దంపతులు చేనేత మగ్గంపై పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో రెండో కుమారుడు ఆకాష్ కు మూడేళ్ల వయసున్నప్పుడు ఇద్దరూ ఇంటిబయట ఆడుకుంటున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆకాష్ కనిపించకుండా పోయాడు. ఆకాష్ కోసం చుట్టూ పక్కల ప్రాంతాలంతో పాటుగా బంధువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోయింది.
ఇది చదవండి: శీతాకాలంలో గాడిదపాలు తాగితే ఒమిక్రానా రాదా..? వాటికి అంత పవర్ ఉందా..?
దీంతో 2008లో తల్లిదండ్రులు మదనపల్లె టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమకు అందిన సమాచారంతో గాలింపు చేపట్టిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆకాష్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఓ వైపు పోలీసులు మరోవైపు బంధువులు ఆకాష్ కోసం గాలింపు చేపట్టారు. కానీ వారికీ నిరాశే మిగిలింది. ఐతే సరిగ్గా 11ఏళ్ల తర్వాత అంటే 2019లో స్థానికులు కొందరు.. ఆకాష్ మదనపల్లె సమీపంలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఇంట్లో ఉన్నట్లు రమణ, రెడ్డమ్మ దంపతులకు సమాచారమిచ్చారు. ఆనందంతో పొంగిపోయిన తల్లిదండ్రులు ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్లి పుట్టుమచ్చల ఆధారంగా కొడుకును గుర్తించారు. ఐతే ఆకాష్ తనకొడుకేనని ఆటోడ్రైవర్ వాదనకు దిగడం, అబ్బాయి కూడా తాను రానని మొండికేయడంతో చేసేది లేక ఇంటికి వెళ్లిపోయారు.
అప్పటినుంచి కొడుకు కోసం రెడ్డమ్మ ఏడుస్తూనే ఉంది. ఐతే తల్లిదండ్రుల కడుపుకోత చూడలేని స్థానికులు ఆకాష్ దగ్గరికి వెళ్లి జరిగిన కథను అతడికి వివరించాడు. కన్నతల్లి ఎదురుచూపులు, స్థానికుల ప్రయత్నాలు ఫలించడంతో ఆకాష్ కన్నివారి దగ్గరకు వెళ్లేందుకు అంగీకరించాడు. అతడి మిస్సింగ్ కేసు నమోదైన మదనపల్లి టూటౌన్ పోలీసుల సమక్షంలో తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరాడు. 14 ఏళ్ల తర్వాత కొడుకు తిరిగిరావడంతో రమణ, రెడ్డమ్మ దంపతులు సంతోషంలో మునిగిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Missing cases