Minister Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. అంతే కాదు.. గెలుపుపై ఎవరికి లెక్కలు వారు వేసుకుంటున్నారు. తాజాగా పర్యాటకశాఖ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా (RK Roja) వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం లంబసింగి (Lambasingi) పర్యటనకు వెళ్తూ.. అనకాపల్లి జిల్లా (Anakapalli District) లోని రాయల్ పార్క్ రిసార్ట్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా పర్యాటక రంగం ఎలా ముందుకు వెళ్తోంది అన్నదానిపై వివరణ ఇస్తూ.. రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి అందాలు దెబ్బతినకుండా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కరోనా (Corona) పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత పర్యాటక రంగం మరింత పుంజుకుందని, టెంపుల్ టూరిజంలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని ఆమె వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే అధికారం అన్నారు. ఇప్పటికే ఈ విషయం ప్రజలు ఫిక్స్ అయ్యారని.. ఆ విషయం తెలిసినా.. చంద్రబాబు సహా విపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయి అన్నారు. ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా.. ఓటర్లు నమ్మే పరిస్థితి లేదన్నారు. కచ్చితంగా తమ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందన్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని గతంలో టీడీపీ చెప్పిందని.. అలా అంటే ప్రజలు అసహ్యించుకుంటారనే అనుమానంతో.. ఆ తర్వాత టీడీపీ మాట మార్చిందన్నారు.
సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తామని ఇప్పుడు టీడీపీ నేతలు చెబుతున్నారని, రోజుకో మాట మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. చెప్పిన మాట చేయడం మాత్రమే జగన్ కు తెలుసు అన్నారు. రోజుకో మాట మార్చడం చంద్రబాబు నైజం అన్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందని గుర్తు చేశారు. జగన్ పాలన కారణంగా రాష్ట్రం బాగుపడిందని, అభివృద్ధి చెందిందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకునేలా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.
ఇదీ చదవండి : ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పాఠశాలల్లో సెమిస్టర్ విధానం.. ఎలా నిర్వహిస్తారంటే?
ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిస్ట్ ప్రాంతాల్లో మరిన్ని వసతులు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నాను అన్నారు. స్వదేశీ దర్శన్, ప్రసాద పథకాలలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు నాలుగు ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Minister Roja, TDP, Visakhapatnam, Ycp