ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ (TDP) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) టార్గెట్ గా మంత్రులు, వైసీపీ (YSRCP) నేతలు వాయిస్ పెంచుతున్నారు. బాబు కుప్పం టూర్ తర్వాత మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ.. బాబుపై మండిపడ్డారు. భవిష్యత్ రాజకీయ చిత్రపటంలో చంద్రబాబు పేరు ఉండదని జోస్యం చెప్పారు. అధికారంలో ఉంటే పిల్లికి కూడా బిచ్చం పెట్టని వ్యక్తి.. మళ్ళీ వస్తే అది చేస్తా, ఇది చేస్తానంటే ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నించారు. బాబు మళ్ళీ అధికారంలోకి రావటం కల్ల అని.., బాబులా మాయ, నయవంచన చేయడం మంత్రి పెద్దిరెడ్డికి చేతకాదన్నారు. బాబు ఎప్పుడు ఎవర్ని ప్రేమిస్తాడో.. ఎప్పుడు విడాకులు ఇస్తాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.
గత మూడు రోజులుగా చంద్రబాబు వాడుతున్న భాష, విమర్శలు చూస్తుంటే పాపం జాలేస్తోందని బొత్స అన్నారు. 40 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు చివరకు ఇంతగా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుప్పంలో కూడా ఎందుకు ఓటమి పాలయ్యామనే ఆత్మవిమర్శ చేసుకుని బాబు మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనే దిశగా మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకుని కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది ఈ ప్రభుత్వం. రాయలసీమకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి మా సీఎం శాసనసభ సాక్షిగా చెప్పారని.., చిన్న చిన్న ఇబ్బందులను సరిచేసుకుని, కొత్త బిల్లుతో ప్రజల ముందుకు వస్తామన్నారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామనే మా సీఎం చెప్పారని.. ఆ దిశగానే తాము ముందుకు వెళుతున్నామన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామా అనేది ఆయన సొంత విషయమని.., రాజీనామా అనేది ఆయన ఇష్టం. దాని గురించి మాట్లాడటం టైమ్‌వేస్ట్ అని బొత్స అన్నారు.
టీడీపీ-జనసేన పొత్తుపై..
చంద్రబాబు అనే వ్యక్తి మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన ఎప్పుడు లవ్ చేస్తాడో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో, ఎప్పుడు విడాకులు తీసుకుంటారో.. మళ్ళీ ఎందుకు లవ్ చేస్తాడో అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌కు సంబంధించిందని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి ఇలాంటివి ఏమీ ఉండవన్న బొత్స.., ప్రజలుతో ఉన్న కమిట్‌మెంట్, వారితో ఉన్న అనుబంధంతోనే ఎన్నికలకు వెళత్తామన్నారు. చంద్రబాబు దుర్మార్గపు మాటలు, దుర్మార్గపు చర్యల వల్లే రాష్ట్ర ప్రజలు ఆయనకు ఈ గతి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ మార్పుపై చెప్పడానికి నేనేమీ జోతిష్యుడిని కాదన్న బొత్స.. తమ నాయకుడు ఏ పదవి ఇస్తే అదే శిరోధార్యమన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.