GT Hemanth Kumar, News18, Tirupati
జీవితంలో ఏదైనా సాధిచాలంటే కష్టపడక తప్పదు. మనం సాధించే వరకు పగలు, రాత్రి అనే తేడాలేకుండా పనిచేస్తేగాని గమ్యాన్ని చేరుకోలేము. కొన్ని సార్లు కష్టానికి తగ్గ ఫలితం దక్కక పోవడం... లక్ష్య సాధనలో ఆలస్యం కావడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఓర్పు, సహనం, పట్టుదల కావాలి. అలా కాదని అడ్డదారులు తొక్కితే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందే. అలా వ్యాపారం చేయాలని భావించిన ఓ యువకుడు.. తనకు వచ్చిన వృత్తిని కొనసాగిస్తూ నాలుగురాళ్లు సంపాదిస్తున్నాడు. కానీ తన కష్టం కేవలం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. దీంతో ఈజీగా డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. సినిమాటిక్ స్టైల్లో దొంగతనం చేద్దామనుకున్నాడు.. కానీ చిన్నతప్పువల్ల పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupati) నగరానికి చెందిన రాజేష్.. ఐటీఐ పూర్తి చేసి ఇళ్లలో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ వచ్చే సంపాదనతో జీవనం సాగిస్తున్నాడు.
ఎప్పూడు జీవితంలో ఎదగాలి అని భావించే రాజేష్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవాలని భావించాడు. అంతేకాదు జిమ్ వ్యాపారం చేయాలన్న ఆలోచన కూడా చేశాడు. ఇందుకు ఈజీ మనీ కావాలి. అందుకోసం జూదం, దొంగతనం అనే రెండు మార్గాలు ఎంచుకున్నాడు. వీటిలో దొంగతనం అయితే సేఫ్ అని భావించి తెలివిగా ఆలోచించాడు. ఒకే ఒక్క దొంగతనంతో లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావించాడు. తనకున్న పరిచయాలతో రెండు ఇళ్లను సెలెక్ట్ చేసుకున్నాడు. వారితో చనువుగా ఉంటూ ఫాలో అవుతున్నాడు.
ఈనెల 13వ తేదీన ఆ రెండిళ్లకు చెందిన వారు ఒకేసారి పొరుగూరు వెళ్లారు. ఎప్పటి నుంచో దొంగతనం కోసం స్కెచ్ వేస్తున్న రాజేష్.. అదే రోజు రాత్రి రెండిళ్లలోకి చొరబడ్డాడు. కిలోన్నరకుపైగా బంగారం, మూడు కేజీల వెండి, ఐదు లక్షల నగదు దోచుకెళ్లాడు. తర్వాతి రోజు వచ్చిన యజమానులు దొంగతనం జరిగిన విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన రాజేష్.. దొంగతనం జరిగిందా అంటూ సానుభూతి చూపించాడు.
మరోవైపు పోలీసులు క్లూజ్ టీమ్ ను రంగంలోకి దింపారు. రెండిళ్లలో ఆధారాలు సేకరించారు. అలాగే ఇంటి యజమానులతో సన్నిహితంగా ఉండేవారి వేలిముద్రలు సేకరించడంతో రాజేష్ గుట్టురట్టయింది. కొన్నిరోజులు రాజేష్ పై నిఘా ఉంచి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడి లేక తాను దొంగతనానికి పాల్పడినట్లు రాజేష్ విచారణలో వెల్లడించాడు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirupati