GT Hemanth Kumar, Tirupathi, News18
దొంగతనాలు చేయడంలో ఒక్కో దొంగది ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు తాళం వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడి నగదు., బంగారు ఆభరణాలు దోచుకెళ్తే.. మరికొందరు పట్టపగలే మనుషులు ఉన్న ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతుంటారు. ఇళ్లలో కాజేస్తే ఏముంటుంది థ్రిల్ అనుకున్నాడు ఓ గజ దొంగ. అందుకే కిక్ దొంగతనానికి ఎవరూ ఊహించని చోటును సెలెక్ట్ చేసుకున్నాడు. ఓ వకీల్ దగ్గర పనిచేసిన అనుభవంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లివచ్చే వాడు. తనో లాయర్ అంటూ పోలీసులకు పరిచయం చేసుకున్నాడు. స్టేషన్ కు వెళ్తూ వస్తున్న తరుణంలో పోలీస్ స్టేషన్ కె కన్నం వేయాలని పక్క ప్లాన్ వేసి పోలీసులనే బురిడీ కొట్టించాడు ఆ ఘరానాదొంగ. నేరస్తులను గడగడలాడించే పోలీసులకే చెమటలు పట్టించాడు.
వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District) కేంద్రానికి చెందిన రాజేంద్ర కుమార్ కొందరు న్యాయవాదుల వద్ద గుమస్తాగా పనిచేసే వాడు. కేసులకు సంబంధించిన ఫైల్స్, ఇతర వ్యవహారాలు చూసుకొనే రాజేంద్ర.., కావలి పోలీస్ స్టేషన్ కు తరచూ వెళ్లివచ్చేవాడు. లాయర్ల దగ్గర నేర్చుకున్న నైపుణ్యం, తెలివిని ఉపయోగించి లక్షలు సంపాదింఛాలనుకున్నాడు. అప్పటికే నేర ప్రవృత్తిలో ఆరితేరిన అతను తానే ఓ లాయర్ అంటూ కలరింగ్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్ కు వచ్చి రాచమర్యాదలు అనుభవించేవాడు.
పోలీసులు ఇచ్చిన మర్యాదను అవకాశాన్ని.... తనకు అనుకూలంగా మలుచుకున్న రాజేంద్ర.. తనలోని ఘరానా దొంగను నిద్రలేపాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో రెక్కీ నిర్వహించాడు. సరైన టైమ్ చూసుకొని పోలీస్ స్టేషన్లోనే చోరీ చేసేశాడు. తర్వాతి రోజు యధావిధిగా పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. దీతో అతనిపై ఎలాంటి అనుమానం రాలేదు. ఐతే స్టేషన్ ప్రాంగణంలో ఉంచిన వాహనాలు కనిపించకపోయే సరికి కానిస్టేబుళ్లు స్టేషన్ ఆఫీసర్ కు సమాచారం ఇచ్చారు. తొలుత సిబ్బందిలో ఒకరే ఇలా చేశారని అనుమానించి విచారణ ప్రారంభించారు. ఐతే దర్యాప్తు సాగుతున్న కొద్దీ వారికి షాకింగ్ నిజాలు తెలిశాయి.
ప్రతిరోజూ లాయర్ అంటూ స్టేషన్ కు వచ్చి కలరింగ్ ఇస్తున్న రాజేంద్రనే అసలు దొంగ అని గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని చోరీ చేసిన జూపిటర్ మరియు యమహా FZ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద నుంచి 1,40,000 రూపాయల విలువ చేసే రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. నేరస్తులను తమదైన స్టైల్లో అరెస్టులు చేసే పోలీసులను లాయర్ అవతారంలో రాజేంద్ర మామూలుగా బురిడీ కొట్టించలేదని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఐతే స్టేషన్ కు కన్నంవేసిన దొంగ దొరకడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.