GT Hemanth Kumar, Tiruapthi, News18
స్వచ్ఛమైన ప్రేమ (Love) కు ఎన్నో నిర్వచనాలు ఉంటాయి. కపట ప్రేమకు మాత్రం మోసం చేయడం మాత్రమే తెలుసు. ప్రేమ అనే రెండు అక్షరాలు మనిషి జీవితంలో వెలుగులు నింపుతాయి. తల్లి చూపించే ప్రేమ.. బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తే.. యువతీయువకుల మధ్య ప్రేమ మంచి జీవితానికి నాంది పలుకుతుంది. నవ మాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన తల్లితండ్రులను కాదని.... ప్రేమ పేరుతో మోసగించే నయవంచకుల చెరలో బంధీలవుతున్నారు యువతులు. తొలుత నువ్వంటే ఇష్టమని.. నీకోసం చనిపోయేంత ప్రేమ అని సినిమా స్టైల్లో కటింగ్ ఇస్తారు. అవసరం తీరిన తర్వాత కన్నింగ్ మెంటాలిటీని బయపెడతారు. నువ్వంటేనే అంటేనే అసహ్యం అనేలా చీదరించుకుంటారు. అదేంటని నిలదీస్తా చంపడానికి కూడా వెనుకాడరు. అలా ప్రేమించిన వాడిని నమ్మి అతడి చేతిలోనే హత్యకు గురైందో యువతి.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) కంబదూరు మండలం దేవరమాను క్రాస్- తిమ్మాపురం రోడ్డులోని ఉప్పరోనిగుట్ట వద్ద పొదల్లో ఇటీవల ఓ యువతి మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. ప్రాధమిక దర్యాప్తులో యువతి స్థానికంగా ఉండే నందినిగా గుర్తించారు పోలీసులు. డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయించిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. చనిపోయేటప్పుడు యువతి ఆరు నెలల గర్భవతిగా తేలింది.
కేసును సీరియగా తీసుకున్న పోలీసులు నందిని ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. ఆమె చివరిసారిగా ఫోన్లో మాట్లాడిన స్నేహితురాలిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నందిని కనగానపల్లె మండలం భానుకోటకు చెందిన నరేష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు ఆమె చెప్పింది. దీంతో నరేష్ కోసం పోలీసులు గాలించగా అతడు అప్పటికే పరారయ్యాడు. ఐతే తన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసి పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వా త జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు తెలిపారు.
తాను, నందిని గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు నరేష్ పోలీసులకు తెలిపాడు. అంతేకాదు ఇద్దరూ శారీరకంగా దగ్గరవడంతో నందిని గర్భం దాల్చిందని.. అప్పటి నుంచి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించారు. తనను పెళ్లి చేసుకోకుంటే పోలీసులకు ఫిర్యాదు చేసిమరీ తాళికట్టించుకుంటానని బెదిరించిందని.. దీంతో ఎలాగైనా ఆమెను అడ్డుతొలగించుకోవాలని ఉద్దేశంతో ఆమెను ఉప్పరోని గుట్టవద్దకు తీసుకెళ్లి ఆమె నోట్లో బలవంతంగా పురుగుల మందు పోసి గొంతునులిమి చంపేసినట్లు అంగీకరించాడు.
దీంతో నరేష్ పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని రిమాండుకు తరలించారు. తాను ప్రేమించిన వాడే సర్వస్వం అని నమ్మిన నందిని.. చివరికి అతడి క్రూరత్వానికి బలైపోయింది. మరోవైపు పెళ్లీడుకొచ్చిన కుమార్తె హత్యకు గురికావడంతో నందిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Crime news, Lovers