మోసపోయే వారు ఉండే వరకు మాయగాళ్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. గుండు సూది నుంచి భూముల వరకు వారికీ నైపుణ్యం ఉన్న రంగాల్లో ఇతరులను బురిడీ కొట్టిస్తున్నారు. ఆఖరికి విద్యార్థుల జీవితాలతో కూడా ఆడుకుంటున్నారు. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ ఇప్పిస్తామంటూ విద్యార్థులకు ఎరవేసి అడ్డంగా దోచుకున్న ఘరానా మోసగాడి ఉదంతం ఇది. పది మందికి పైగా ఉద్యోగులు మోసపోయి 38 లక్షలు పోగొట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం నాగినాయిని చెరువు తండాకు చెందిన అభినయ్ నాయక్ మహారాష్ట్రలో బిఎస్సి అగ్రి కల్చర్ చదువుతూ చెడు వ్యసనాల కారణంగా చదువును మధ్యలోనే విడిచిపెట్టి 2014లో స్వగ్రామానికి వచ్చేశాడు. ఆ తర్వాత క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కు పూర్తిగా బానిసయ్యాడు. డబ్బు సంపాదన కోసం తప్పు దారి పట్టాడు.
కొతంకాలం తర్వాత హైదరాబాద్ కు వెళ్లి ఫ్యూచర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. పెద్ద యూనివర్సిటీలో బీఎస్సి అగ్రి కల్చర్ సీటు ఇప్పిస్తామని విద్యార్థులను నమ్మించాడు. మహారాష్ట్రలోని రెండు పెద్ద అగ్రి కల్చర్ యూనివెర్సిటీలలో సీటు మీకే ఖాయమని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. అలా వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్లను చూసిన 13 మంది విద్యార్థులు అభినయ్ నాయక్ ను సంప్రదించారు. యూనవర్సిటీల్లో సీట్లు ఇప్పిస్తానంటూ వారి వద్ద నుంచి 38,36,000 వసూలు చేశాడు. ఐతే అప్పటి నుంచి ఈ రోజు రేపు అంటూ కాలయాపన చేసి వారిని నమ్మించాడు. కొంత కాలానికి అక్కడనుంచి వేరొక చోట మకాం మార్చాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాదిత విద్యార్థులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అభినయ్ పై హైదరాబాద్ లో 3, అనంతపురం జిల్లా ధర్మవరం, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. విచారణ చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న అభినయ్ నాయక్ ను అరెస్ట్ చేసారు. అతని వద్ద నుంచి ఒక కారుతో పాటుగా ల్యాప్టాప్, మ్యాక్ బుక్, ఐపాడ్, రెండు రబ్బర్ స్టాంపులు, ఖాళీ దరఖాస్తు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. యువకులకు మాయమాటలు చెప్పి... మోసం చేసిన అభినయ్ నాయక్ ఆ డబ్బులను జల్సాలకు వాడుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ ల మోజులో పడి అంతా పొగొట్టుకున్నాడు. మొదట ఆదాయం బాగానే రావడంతో బెట్టింగ్ మాయకు పూర్తిగా లొంగిపోయాడు. లక్షల్లో పదేంలు కాస్తూ వచ్చాడు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ లో బాల్ టూ బాల్, రన్ టూ రన్, టీమ్స్ పై భారీగా బెట్టింగ్ కాచే వాడని పోలీసులు గుర్తించారు. ఈ బెట్టింగ్లో భారీగా నష్టాలు కావడంతో కాజేసిన సొమ్మంతా కోల్పోయినట్లు నిర్ధారించారు. నింధుతుడైన అభినయ్ నాయక్ ను న్యాయమూర్తి ముందు హాజరు పరుచగా 14 రోజుల రీమండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.