ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూఢభక్తి, పునర్జన్మలపై విశ్వాసంతో కన్న కూతుళ్లనే తల్లిదండ్రులు పొట్టనబెట్టుకున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజలు జైలులో వింతగా ప్రవర్తించడం, కేకలు వేయడం వంటివి చేశారు. దీంతో వారికి విశాఖపట్నంలోని మెంటల్ హాస్పిటల్ లో చికిత్స చేయించాల్సి వచ్చింది. ఇటీవలే కోలుకోవడంతో వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో మదనపల్లె కోర్టులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ జరిగింది. అనంతరం కోరు వారికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో మదనపల్లి సబ్ జైలు నుంచి ఇద్దరూ విడుదలయ్యారు. ఐతే ఇంత కిరాతకానికి పాల్పడిన వారికి బెయిల్ మంజూరు కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్ మంజూరైన సందర్భంగా మదనపల్లి సబ్ జైలు వద్దకు వచ్చిన బంధువులు.. నిందితులిద్దరినీ ఇంటికి తీసుకెళ్లారు.
చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు ఉన్నత విద్యావంతులు. పురుషోత్తంనాయుడు మహిళా డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తుండగా.. పద్మజ మాస్టర్ మైండ్స్ స్కూల్ కరస్పాడెంట్ గా ఉన్నారు. వీరికి సాయిదివ్య, అలేఖ్య అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వారు కూడా ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో మూఢభక్తి, విశ్వాసాలకు లోనయ్యారు. పునర్జన్మలపై నమ్మకంతో పురుషోత్తం, పద్మజలు కన్నకూతుళ్లనే హత్య చేశారు. దాదాపు రెండు రోజుల పాటు నగ్నంగా పూజలు చేసిన అనంతరం కూతుళ్లను డంబెల్ తో కొట్టి హత్య చేశారు. ఈ క్రమంలో పురుషోత్తం నాయుడు ఓ మిత్రుడికి ఫోన్ చేసి విషయం చెప్పగా.. అసలు జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా.. అప్పటికే పూనకంతో ఊగిపోతున్న దంపతులు వారిని వెళ్లిపోవాల్సిందిగా కోరారు. తమ కుమార్తెలు తిరిగివస్తారని పోలీసులు అంతా పాడు చేశారని వారిపైనే మాటల యుద్ధానికి దిగిన పరిస్థితి వచ్చింది.
ఇక హత్యల ఘటన వెలుగులోకి వచ్చిన రెండు రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించగా.. తనని తాను శివుడుగా భావించుకున్న పద్మజ.. తోటి ఖైదీలపై కేకలు వేయడం, వింతగా ప్రవర్తించడంతో వారి మానసిక స్థితి సరిగా లేదని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. అక్కడ రెండు నెలల చికిత్స అనంతరం ఇటీవల మదనపల్లెకు తరలించగా.. తాజాగా కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు బెయిల్ పై ఇంటికెళ్లిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతుల ప్రవర్తల ఎలా ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది. మూఢవిశ్వాసంతో ఇద్దరు కుమార్తెలను పొట్టబెట్టుకున్నవారు పశ్చాత్తాపడతారా..? లేక గతంలో మాదిరిగా ఉంటారా అనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే ప్రభుత్వం పురుషోత్తం నాయుడ్ని ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news