GT Hemanth Kumar, Tirupati, News18
పుష్కరిణి స్నానం. వరాహ అనుగ్రహం. శ్రీ వేంకటేశ్వరుని దర్శనం (Lord Venkateswara Darshanam)... ప్రసాద స్వీకరణంతో తిరుమల (Tirumala)యాత్ర సంపూర్ణం అవుతుందని శ్రీవారి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. స్వామి వారి దర్శనంకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే భక్తులు... శ్రీవారికి నైవేధ్యంగా సమర్పించే ప్రసాదాన్ని అమృతంలా భావిస్తారు. అందుకే స్వామి వారి ప్రసాదాన్ని (Tirumala Prasadam) కళ్ళకు అద్దుకొని సేవిస్తారు భక్తులు. తిరుమల యాత్రలో ఒక్కో ఘట్టానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. పవిత్రంగా భావించే అన్న ప్రసాదాన్ని స్వీకరించి... లడ్డు ప్రసాదాలను (Tirumala Laddu Prasadam) తమ ఊర్లకు తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్లిన ప్రసాదాన్ని బంధుమిత్రులకు., ఇరుగు పొరుగు వారికీ అందిస్తారు. శ్రీవారి ప్రసాదాల్లో అత్యధికంగా జీడీ పప్పులను వినియోగిస్తారు. నెయ్యి నుంచి జీడిపప్పు వరకు ప్రసాదానికి వినియోగించే ముడి సరుకులను అత్యంత నాణ్యమైనవి వాడుతారు. అందుకే శ్రీవారి ప్రసాదం ఎంతో రుచిగాను, సువాసనను కలిగి ఉంటాయి. అందుకే భక్తులు భక్తి భావంతో గోవింద నామాన్ని స్మరిస్తూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
తాజాగా టీటీడీలో(TTD) ముడిసరుకుల గోల్మాల్ ఉదంతం వెలుగు చూసింది. నిత్యం ప్రసాదంలో వినియోగించే ముడి సరుకుల కొనుగోలలో భారీగా అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు టీటీడీలో పనిచేసే ఉద్యోగుల సహాయంతో కొందరు కాంట్రాక్టర్లు శ్రీవారి ప్రసాదాలకు నాసిరకం జీడిపప్పును తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలిన సమాచారం. బెంగళూరుకుచెందిన హిందుస్తాన్ ముక్తా కంపెనీ టీటీడీకి జీడిపప్పును సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. గత కొద్దినెలలుగా పాడైపోయిన జీడిపప్పును సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి: భక్తులకు శుభవార్త చెప్పడం వెనుక కారణం ఇదేనా..? పెరటాశి నెల అంటే ఏమిటీ..?
అలిపిరి టీటీడీ వేర్ హౌస్ కేంద్రానికి గత కొద్దీ నెలలుగా పాడైపొయ్యిన జీడిపప్పును సరఫరా చేస్తుండగా.., జీడిపప్పు నాసిరకంగా ఉందని ఇప్పటికే పది వేల కేజీల జీడిపప్పును టీటీడీ వెనక్కి పంపింది. అతితెలివి ఉపయోగించిన కాంట్రాక్టర్ టీటీడీ తిప్పి పంపిన జీడిపప్పునే మళ్లీ కొత్త ప్యాకింగ్ వేసి టీటీడీకి పంపాడు. ఇంటి దొంగల సహాయంతో కాంట్రాక్టర్ ఇలా చేస్తున్నారని టీటీడీ ఉన్నతాధికారులు గుర్తించారు. టీటీడీ వేర్ హౌస్ నుంచి నిత్య అన్నదానం, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి ఈ నాసిరకం జీడిపప్పు సరఫరా చేయ్యగా పంపిన సరుకు బాగోలేదని అక్కడి సిబ్బంది దీన్ని అధికారులు దృష్టికి తెచ్చారు.
ఉద్యోగుల కుమ్మక్కు..?
సరఫరా సంస్థతో మార్కెటింగ్ విభాగంలో కొందరు ఉద్యోగుల కుమ్మక్కయినట్లు అనుమానం రావడంతో పాటు పురుగుపట్టిన జీడిపప్పు సరఫరాను సీరియస్గాు పరిగణించిన టీటీడీ విజిలెన్స్ విభాగంతో విచారణ కూడా చెయ్యించినట్లు సమాచారం.విజిలెన్స్ నివేదిక మేరకు కాంట్రాక్టర్ తో పాటు ఇంటి దొంగల పై కూడా టీటీడీ చర్యలు తీసుకున్నెందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఐతే ఈ అంశం పై ఇప్పటి వరకు టీటీడీ స్పందించలేదు. ఐతే శ్రీవారి ప్రసాదాలకు నాసిరకం సరుకులు సరఫరా చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రత కలిగి, భక్తులు ప్రీతిపాత్రంగా భావించే ప్రసాదం తయారీలో ఇలా అవకతవకలకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd news